Share News

వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే రేషన్‌

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:40 PM

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్‌ సరుకుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే రేషన్‌
వృద్ధురాలికి రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్‌ సరుకుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ డీలర్లు ఇంటి వద్దకు వెళ్లి రేషన్‌ సరుకులు అందిస్తారని తెలిపారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు చౌక డిపోల్లో సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్డుదారులు వీలునుబట్టి వెళ్లి సరుకులు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, పిడతల రవికుమార్‌, పాల్గొన్నారు.

గిద్దలూరు : వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే బియ్యం, పంచదార స రుకులను అందిస్తారని తహసీల్దార్‌ ఎం. ఆంజనేయరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులతోపాటు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు రేషన్‌ దుకాణాల వద్దకు రావల్సిన అవసరం లేదని, వీరందరికీ డీలర్ల ద్వారా నేరుగా వారి ఇళ్లకే రేషన్‌ సరుకులు పంపిణీ జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో 23472 రేషన్‌కార్డులు ఉండగా వీరిలో 2210 మంది వృద్దులు, దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ఈనెల 5వ తేదిలోగా వారి ఇళ్ల వద్దకు డీలర్లు వెళ్లి రేషన్‌ సరుకులు అందిస్తారని పేర్కొన్నారు. రేషన్‌ విషయంలో దివ్యాంగులు, వృద్దులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేషన్‌ సరుకులు అందకపోతే తమకు ఫిర్యాదు చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పుల్లలచెరువు : ఇకపై వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్‌ అందించాలని తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు డీలర్లను ఆదేశించారు. మంగళవారం ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు రేషన్‌ను పంపిణీ చేశారు.

Updated Date - Jun 03 , 2025 | 10:41 PM