Share News

రూటు మార్చిన రేషన్‌ మాఫియా

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:29 AM

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో వ్యాపారులు రూటు మార్చారు. గతంలో ఒక చోట నిల్వ చేసి, ఆ తర్వాత గోతాలు మార్చి లారీల్లో మిల్లులకు తరలించేవారు. ఆ సమయంలో అధికారులకు సమాచారం అంది దాడులు చేసి పట్టుకునే వారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు పంథా మార్చారు. దుకాణాల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని చిన్నచిన్న వాహనాల్లో నేరుగా మిల్లులకు చేరుస్తున్నారు.

రూటు మార్చిన రేషన్‌ మాఫియా
రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ ఇటీవల త్రోవగుంట సమీపంలో పట్టుబడిన లారీ (ఫైల్‌)

అడ్డదారుల్లో బియ్యం తరలింపు

లారీల్లో కాకుండా చిన్నచిన్న వాహనాల వినియోగం

గోతాలు కూడా మార్చకుండా నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు

ఎన్‌జీపాడు మండలంలో 624 బస్తాలను పట్టుకున్న అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో వ్యాపారులు రూటు మార్చారు. గతంలో ఒక చోట నిల్వ చేసి, ఆ తర్వాత గోతాలు మార్చి లారీల్లో మిల్లులకు తరలించేవారు. ఆ సమయంలో అధికారులకు సమాచారం అంది దాడులు చేసి పట్టుకునే వారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు పంథా మార్చారు. దుకాణాల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని చిన్నచిన్న వాహనాల్లో నేరుగా మిల్లులకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు.

తగ్గిన కేసుల నమోదు

ప్రతినెలా ఇదే తంతు జరుగుతుండటంతో కేసుల నమోదు కూడా తగ్గిపోయింది. ఎక్కడైనా వాహనాల్లో తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులు దాడులు చేసి పట్టుకుం టున్నారు. నాలుగు రోజుల క్రితం చీరాల ప్రాంతం నుంచి నెల్లూరు వైపు లారీలో బియ్యం తరలిస్తుండగా అజ్ఞాతవ్యక్తి ఇచ్చిన సమాచారంతో మద్దిపాడు మండలంలో ఒక లారీని పట్టుకున్నారు. ఆ లారీలో 624 బస్తాల బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యం నేరుగా రేషన్‌ షాపుల నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గోతాలు మార్పిడి చేయకుండానే నేరుగా ఆ బియ్యాన్ని తరలిస్తున్నారు. చిన్నచిన్న వాహనాల్లో బియ్యం తరలించడం ద్వారా ఎక్కడైనా పట్టుకున్నా కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉండటంతో వ్యాపారులు కూడా తమ దారిని మార్చుకొని ముందుకు సాగుతున్నారు.


తరలింపునకు మధ్యవర్తులు

ఈ నెలలో జిల్లాలో నాగులుప్పలపాడు మండలంలో పట్టుకున్న బియ్యం మినహా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బియ్యం తరలించేందుకు దళారులను ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి పోర్టుకు తరలిస్తున్నారు. మధ్యవర్తులు కూడా బియ్యం తరలించేందుకు ఆదాయవనరుగా ఉండటంతో చిన్న వాహనాల్లో బియ్యం తరలిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒకేచోట నిల్వలు పెట్టి తరలింపు చేయకుండా ఏ రోజుకారోజు వచ్చిన బియ్యాన్ని ఎగుమతులు చేసే విధంగా వ్యాపారులు కొత్త పంథాలో బియ్యం తరలింపు చర్చనీయాంశమైంది.

Updated Date - Mar 16 , 2025 | 01:29 AM