కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలి
ABN , Publish Date - May 29 , 2025 | 11:26 PM
ప్రతి కార్డుదారునికి జూన్ 1వ తేదీ నుంచి డీలర్లు రేషన్ సరుకులు సక్రమంగా అందజేయాలని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ సూచించారు. ఎమ్‌డీయూ ఆపరేటర్ల స్థానే జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మార్కాపురం, మే 29 (ఆంధ్రజ్యోతి) : ప్రతి కార్డుదారునికి జూన్ 1వ తేదీ నుంచి డీలర్లు రేషన్ సరుకులు సక్రమంగా అందజేయాలని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ సూచించారు. ఎమ్‌డీయూ ఆపరేటర్ల స్థానే జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దుకాణాల్లో అన్ని వసతులు, సంసిద్ధత సక్రమంగా ఉండా లేదా అని గురువారం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ తనిఖీ చేశారు. ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటి ఒంటరిగా ఉండే వృద్ధులు, దుకాణాల వద్దకు రాలేని ఒంటరి వికలాంగులు ఉంటే తప్పకుండా రేషన్ డీలరే వారి ఇళ్లకు వెళ్లి సరుకులు అందించాలన్నారు. సకాలంలో రేషన్ సరుకులు కార్డుదారులకు అందించాలన్నారు. అంతేకాక ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కె.చిరంజీవి, రెవిన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రామనారాయణరెడ్డి పలు రేషన్ దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్‌షాపుల వద్ద పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. పట్టణంలో 15 రేషన్ దుకాణాలు ఉన్నాయని, లబ్ధిదారులు తమ పరిధిలో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో రంగయ్య, ఖాశింవలి ఉన్నారు.
డీలర్లు వేళలు పాటించాలి
ఎర్రగొండపాలెం : చౌకదుకాణాల వద్ద డీలర్లు సమయపాలన పాటించాలని తహసీల్దార్ మంజునాథరెడ్డి గురువారం ఆదేశించారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి, మధ్యాహ్నం 12 గంటలవరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు షాపులను తెరిచి ఉంచి కార్డుదారులకు సక్రమంగా సరుకులు అందజేయాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖరు, డీలర్లు పాల్గొన్నారు.
కొమరోలు : రేషన్ దుకాణాలకు వచ్చే కార్డుదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం డీలర్లతో రెవెన్యూ, ఎన్‌ఫార్సుమ్మెంట్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయు యాట్లాడుతూ సరుకులను సక్రమంగా అందజేయాలని, కార్డుదారుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్సుమెంటు డీటీ వెంకట్రామిరెడ్డి, డీటీ వెంకటరెడ్డి, సీనియర్ అసిస్టేంటు నాయక్, డీలర్లు పాల్గొన్నారు.