రేషన్ డోర్ డెలివరీ ఇక లేనట్లే!
ABN , Publish Date - May 22 , 2025 | 01:41 AM
వైసీపీ ప్రభుత్వ హయాం లో ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా రేషన్ పంపిణీ ఇక నిలిచినట్లే. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై అధికభారం పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది.
ఆగిపోనున్న మొబైల్ వాహనాలు
ప్రభుత్వంపై భారీగా తగ్గనున్న భారం
జిల్లాలో నెలకు రూ.80 లక్షల మేర ఆదా
ఇకపై చౌకధరల దుకాణాల ద్వారానే పంపిణీ
ఒంగోలు కలెక్టరేట్, మే 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాం లో ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా రేషన్ పంపిణీ ఇక నిలిచినట్లే. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై అధికభారం పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది. ఐదు రోజుల క్రితం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఎండీయూ ఆపరేటర్ల సంఘ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఎండీయూలను నిలిపివేసి గతంలో మాదిరి చౌకధరల దుకాణాల ద్వారా నేరుగా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మం డలి ఆమోదం తెలిపింది.
ఎండీయూల ద్వారా పంపిణీలో ఆలస్యం
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎండీయూ ఆపరేటర్ల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు. దీనివలన బియ్యం పక్కదారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై భారీగా ఆర్థికభారం పడుతోంది. జిల్లాలో 1,392 రేషన్ షాపుల పరిధిలో 385 మొబైల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో దానికి నెలకు రూ.21వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆవిధంగా మొత్తం వాహనాలకు సుమారు రూ.80లక్షలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ కూడా ఆలస్యమవుతుండటాన్ని గుర్తించారు. పైగా కార్డుదారులు పనులను మానుకొని ఇళ్ల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజువారీ కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వారు ఒక్కోసారి రేషన్ తీసుకోలేకపోతున్నారు. మరోవైపు ఎండీయూ వాహనం వద్ద ఒక్కోసారి సర్వర్ పనిచేయక గంటల తరబడి వేచిఉండాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎండీయూ వాహనాల రద్దు నిర్ణయం తీసుకుంది.