మాక్ అసెంబ్లీలో అదరగొట్టిన రమ్యశ్రీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:10 AM
అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో గిద్దలూరుకు చెందిన ఎన్.రమ్యశ్రీ హోంమంత్రి పాత్ర పోషించింది. తనదైన శైలిలో అదరగొట్టింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొంది.
హోంమంత్రిగా తనదైన పాత్ర పోషించిన గిద్దలూరు విద్యార్థిని
దీటైన సమాధానాలతో అందరి నుంచి ప్రశంసలు
గిద్దలూరు టౌన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో గిద్దలూరుకు చెందిన ఎన్.రమ్యశ్రీ హోంమంత్రి పాత్ర పోషించింది. తనదైన శైలిలో అదరగొట్టింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొంది. ఆ విద్యార్థినికి హోంమంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు రమ్యశ్రీ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులను అబ్బురపరిచింది. గంజాయి, వివిధ రకాల డ్రగ్స్ కారణంగా కళాశాలల్లోని విద్యార్థులు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటున్నదని ప్రతిపక్ష సభ్యులు నిలదీయగా హోంమంత్రిగా రమ్యశ్రీ దీటైన సమాధానాలను చెప్పింది. గంజాయి, డ్రగ్స్‌ను ఎంత స్థాయిలో పట్టుకున్నదని, ఎంత మందిని అరెస్టు చేసింది వివరించింది. రాబోయే పదేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని బదులిచ్చింది. మరో ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలపై విద్యా సంస్థలు, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని సభకు హామీ ఇచ్చింది. మాక్ అసెంబ్లీలో హోంమంత్రిగా అదరగొట్టిన రమ్యను పాఠశాల హెచ్‌ఎం, ఎంఈవో పి.నాగభూషన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.