Share News

వర్షాలకు దెబ్బతిన్న చప్టాలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:56 PM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అన్నీ రకాలుగా నష్టం జరిగింది. దర్శి ప్రాంతంలో పంటలతో పాటు రోడ్లు, బ్రిడ్జిలు, చప్టాలు దెబ్బతిన్నాయి.

వర్షాలకు దెబ్బతిన్న చప్టాలు
దర్శి - ఆరవళ్లిపాడు రోడ్డులో తూర్పువెంకటాపురం వద్ద దెబ్బతిన్న లోలెవల్‌ బ్రిడ్జి

కూలే పరిస్థితి నెలకొనటంతో

ఆందోళన చెందుతున్న ప్రజలు

దర్శి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అన్నీ రకాలుగా నష్టం జరిగింది. దర్శి ప్రాంతంలో పంటలతో పాటు రోడ్లు, బ్రిడ్జిలు, చప్టాలు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దర్శి-ఆరవళ్లిపాడు రోడ్డులో తూర్పువెంకటాపురం వద్ద పెద్దవాగుపై నిర్మించిన లోలెవల్‌ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈవాగు ఉధృతంగా ప్రవహించింది. అంచులు కొట్టుకొని పోవటంతో వాగు, ఎన్‌ఏపీ పైప్‌లైన్‌ ధ్వంసమయ్యాయి. దీంతో ఎగువప్రాంత గ్రామాలకు మంచినీరు నిలిచిపోయింది,. దర్శి-పొదిలి రోడ్డులో కాటేరువాగుపై సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిన చప్టా పూర్తిగా దెబ్బతింది. గతంలోనే బ్రిడ్జి సామర్థ్యం కోల్పోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఈవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇరువైపులా అంచులు మరింత కొసుకుపోయి ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజంపల్లి - బొద్దికూరపాడు రోడ్డులో లక్ష్మీనారాయణపురం వద్ద వాగుపై నిర్మంచిన లోలెవల్‌ బ్రిడ్జి కూడా దెబ్బతింది. దెబ్బతిన్న బ్రిడ్జిలకు మరమ్మతులు చేయకపోతే ఏ నిమిషంలోనైనా కూలే ప్రమాదముంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 10:56 PM