Share News

అతలాకుతలం

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:05 AM

జిల్లాకు వాయు‘గండం’ తప్పినా తెరపి లేకుండా నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. అనేక చోట్ల చెరువులు నిండి అలుగులు పారాయి.

అతలాకుతలం
కంభం మండలం ఎర్రబాలెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ

గండం తప్పినా కొనసాగిన వాన

నాలుగు రోజుల్లో 112.0 మి.మీ సగటు వర్షపాతం

పలు మండలాల్లో అంతకు మించి నాలుగు రెట్లు

అల్పపీడన ప్రభావంతో దంచికొట్టిన వాన

పొంగిన వాగులు, వంకలు.. రవాణాకు ఆటంకం

పల్లెలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం

గుండ్లకమ్మకు పెరిగిన వరద, నాలుగు గేట్లు ఎత్తివేత

జిల్లాకు వాయు‘గండం’ తప్పినా తెరపి లేకుండా నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. అనేక చోట్ల చెరువులు నిండి అలుగులు పారాయి. వర్షపు నీటి ఉధృతితో వాగులు దాటేందుకు వీలు లేక అనేక రోడ్డు మార్గాలలో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. అటు పల్లెలు, ఇటు పట్టణాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. అదే సమయంలో వేలాది ఎకరాల్లోని ఖరీఫ్‌ పంటలు నీట మునిగాయి. దీంతో నష్టం అధికంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఒంగోలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నాలుగు రోజుల్లో 112.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అనేక మండలాల్లో అంతకు నాలుగు రెట్లు కురిసింది. జిల్లాలో ఈ నెలలో సాధారణంగా వర్షాలు అధికంగానే ఉంటాయి. వార్షిక వర్షపాతం 679.80 మి.మీ కాగా అత్యధికంగా ఈనెలలోనే సుమారు 207మి.మీ కురుస్తుంది. అందులో ఈ సమయానికి 175 మి.మీ కురవాలి. అయితే ఈనెలలో 206 మి.మీ కురిసింది. అందులో ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 112.0 మి.మీ పడింది. అంటే ఈ నాలుగు రోజులకు ముందే జిల్లాలో 145 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో అత్యధిక ప్రాంతాల్లో భూములు బాగా నెమ్ముతో ఉన్నాయి. అలాగే వాగులు, వంకల్లో ప్రవాహాలు, చెరువుల్లోకి పుష్కలంగా నీరు చేరి ఉంది. ఇక చుక్కపడినా బయటకు పెట్టా ల్సిన పరిస్థితి ఉన్న ఈ సమ యంలో వరుసగా నాలుగు రోజులు తెరపిలేకుండా భారీగా వర్షం కురవడంతో నీటి వన రులు పొంగి ప్రవహిస్తున్నాయి.

నిండిన గుండ్లకమ్మ.. దిగువకు నీరు

జిల్లాలోని మైదాన ప్రాంతాలతోపాటు నల్లమల అటవీ ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షం పడటంతో గుండ్లకమ్మకు భారీగా నీరు వస్తోంది. మార్కాపురం, కంభం ప్రాంతాలలో గుండ్లకమ్మ పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 24.38 మీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 3.859 టీఎంసీలు. ప్రస్తుతం 23.9 మీటర్ల మేర నీటిమట్టం, 3.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సమయంలో ఎగువ నుంచి 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా నాలుగు గేట్లు ఎత్తి 9,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. రామతీర్థం ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండి ఉంది. ఎగువన పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరులోని సగిలేరుకు భారీగా వరద నీరు వస్తూ ఉధృతంగా ప్రవహిస్తోంది. కంభం మండలంలోని నల్లవాగు, రావిపాడు సమీపంలో, అలాగే ఎర్రబాలెం వద్ద గుండ్లకమ్మ పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దోర్నాల, పెద్దారవీడు, మార్కాపురం తదితర మండలాల్లోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాచర్ల మండలంలోని పగిడివాగు, కొమరోలు మండలంలోని బాదినేనిపల్లి వాగు, సూరావారిపల్లి వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సీఎస్‌పురం మండలంలోని భైరవకోన జలపాతానికి భారీగా నీరు వస్తోంది. మోపాడు రిజర్వాయర్‌, కంభం చెరువులకు భారీగానే నీరు చేరుతోంది. కనిగిరి నియోజకవర్గంలోని అనేక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒంగోలులోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన వీధులు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలు నీటిలోనే ఉన్నాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

నాగులుప్పలపాడు మండలంలోని కొత్తకోట వాగు, సంతనూతలపాడు-కొండపి మార్గంలో ఉన్న ముసినది, ఇనగలేరు, అట్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఒంగోలు నుంచి సంతనూతలపాడు మీదుగా కొండపి, కామేపల్లి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ, బీపేట మండలం గలిజేరుగుళ్ల, దోర్నాల మండలం కడపరాజుపల్లె చెరువులు తెగడం, అలుగులు పారడంతో దిగువ పొలాల్లోకి భారీగా నీరు చేరింది. మరోవైపు తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పల్లె, పట్టణం అలాగే చిన్నపెద్ద తేడా లేకుండా అనేక రోడ్లు ఛిద్రమయ్యాయి. భారీ వాహనాలు కాదు కదా కనీసం చిన్న వాహనాలు చివరకు కొన్నిచోట్ల నడకకు కూడా వీలుకాని పరిస్థితి కనిపిస్తోంది.

దెబ్బతింటున్న పంటలు

తాజా వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి, మిర్చి, వరి, కంది, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, మినుము వంటి పంటలు అనేక చోట్ల నీటమునిగాయి. సుమారు 50వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు నీటిలో ఉన్నట్లు తెలుఓస్తంది. వర్షం తెరపి ఇచ్చాక అసలు నష్టాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇటు రెవెన్యూ, అటు పోలీస్‌ అధికారులు కలెక్టర్‌, ఎస్పీలు రాజాబాబు, హర్షవర్థన్‌రాజుల నేతృత్వంలో మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నారు. తీరప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతోపాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకుండా ఆపారు. పలు శాఖల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - Oct 25 , 2025 | 01:05 AM