Share News

బాణసంచా అమ్మకాలకు వాన దెబ్బ

ABN , Publish Date - Oct 19 , 2025 | 10:34 PM

అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న జల్లులకు బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. వానలకుతోడు దీపావళి ధరలు తారాజువ్వల్లా ఆకాశానికి అంటుతుండడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు.

బాణసంచా అమ్మకాలకు వాన దెబ్బ
కంభంలో దీపావళి టపాసులు కొనేవారు లేక వెలవెలబోతున్న దుకాణాలు

కంభం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న జల్లులకు బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. వానలకుతోడు దీపావళి ధరలు తారాజువ్వల్లా ఆకాశానికి అంటుతుండడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. గతం లో ఎప్పుడూ లేని విధంగా దీపావళి టపాసుల ధరలు అధికంగా ఉండడంతో అంత రేట్లు పెట్టి కొనాలా వద్దా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆదివారం రాత్రి కూడా వాన కురిసింది. బాణసంచా అంత రేట్లు పెట్టి కొనే బాధ తప్పుతుందని పలువురు బహిరంగంగానే అనుకోవడం కనబడుతుంది. బాణసంచా లైసెన్స్‌ సంపాదించి దీపావళి సరుకులు విక్రయించే వ్యాపారులు మాత్రం బాణసంచా లైసెన్స్‌ సంపాదించేందుకు పోలీస్‌, రెవెన్యూ అగ్నిమాపక సిబ్బందికి వేల రూపాయలు ఇచ్చామని, మరోపక్క బాణసంచా కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి అన్నీ కలిపి తాము లాభాల బాట పట్టాలంటే ఆమాత్రం ధరలకు అమ్మాల్పిందేనని చెప్తున్నారు.

బంగారు దుకాణాలు వెలవెల

గిద్దలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : బంగారం, వెండి ధరలు దీపావళి టపాసుల లాగా ఆకాశాన్ని అంటాయి. దాంతో ధన త్రయోదశి అయినప్పటికీ బంగారు, వెండి ఆభరణాలను కొనలేని పరిస్థితి నెలకొన్నది. దాంతో బంగారు, వెండి దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. అక్షయతృతీయ, ధన త్రయోదశి రోజుల్లో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్న భావన ప్రజల్లో నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బంగారు, వెండి ధరలు ఊహించనంతగా పెరగడంతో సామాన్యులకు, మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. కనీసం లక్ష్మీకాసులను కూడా కొనలేనంత రేట్లు పెరగడంతో కొనుగోలుదారులు బంగారు దుకాణాలవైపు చూడలేదు.

Updated Date - Oct 19 , 2025 | 10:34 PM