సింగరాయకొండలో వర్ష బీభత్సం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:24 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మండలంలోని పాకల గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 147.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
పాకలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 147.5మి.మీ వర్షపాతం
జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు
తీరప్రాంత గ్రామాల్లో పర్యటించిన జడ్పీ సీఈవో, తహసీల్దార్
సింగరాయకొండ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మండలంలోని పాకల గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 147.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్ష భీభత్సం దాటికి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు బయటకుపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని పాతపోస్టాఫీస్ వీధి, భైరాగిమన్యం, అరుణాకాలనీల్లో పల్లపు ప్రాంతాల్లోని పలు గృహాల్లోకి వర్షపు నీరుచేరడంలో ప్రజలు అవస్థలు పడ్డారు. సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో లోతట్టుప్రాంతమైన ఎస్టీకాలనీ అప్పాపురంలో వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక టీడీపీ నేతలు వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బేసిన్ పల్లెపాలెంలో వర్షపు నీరు బయటకు వెళ్లే వీలులేక వీధులన్నీ జలమయంగా మారాయి. పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ఆంజనేయస్వామిగుడి ప్రహరీ గోడ కుప్ప కూలింది. జడ్పీ సీఈవో చిరంజీవి, తహసీల్దార్ ఎన్‌బీవీ రాజేష్ తీరప్రాంత గ్రామాలైన పాకల, ఊళ్లపాలెంతోపాటు సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని అప్పాపురంలో పర్యటించారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.