Share News

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:53 AM

వినియోగదా రులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో ఆర్డీఎస్‌ఎస్‌ పనులు, పీఎం సూర్యఘర్‌ పురోగతి, వ్యవసాయ కనెక్షన్లు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష చేశారు.

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి, వేదికపై ఎస్‌ఈ వెంకటేశ్వర్లు

ఎస్సీ, ఎస్టీలకు 30వేల ఉచిత సోలార్‌ కనెక్షన్లు

వ్యవసాయ కనెక్షన్లకు 1,700 ట్రాన్స్‌ఫార్మర్లు

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి వెల్లడి

ఆర్డీఎస్‌ఎస్‌ పనులపై అధికారులతో సమీక్ష

ఒంగోలు క్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : వినియోగదా రులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో ఆర్డీఎస్‌ఎస్‌ పనులు, పీఎం సూర్యఘర్‌ పురోగతి, వ్యవసాయ కనెక్షన్లు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆర్డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. తద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయవచ్చన్నారు. వ్యవసాయ కనెక్షన్లు 1,700 పెండింగ్‌లో ఉన్నాయని వాటికి అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌, ఇతర సామగ్రి అందజేస్తామని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌ (సోలార్‌ రూప్‌టాప్‌) కింద జిల్లాలో 30వేల కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకున్నదని వెల్లడించారు. ప్రస్తుతం 2వేల సోలార్‌ రూఫ్‌ టాప్‌లు ఏర్పాటు చేసుకున్నారని, నెలకు 300 ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు బ్రేక్‌ డౌన్‌ కావడంతో సరఫరాకు అంతరాయం వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అలాంటి అంతరాయాలు లేకుండా నెలకు ప్రతి డివిజన్‌లో 33 కేవీ లైన్‌, ప్రతి సెక్షన్‌లో రెండు 11 కేవీ లైన్లు తనిఖీలు చేసి కారణాలను గుర్తించి పునరుద్ధరించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యుత్‌ బకాయిల వసూలు జిల్లాలో వేగవంతంగా ఉండటంపై సిబ్బందిని అభినందించారు. అదేవిధంగా విద్యుత్‌ లైన్లపై నిరంతరం పెట్రోలింగ్‌ చేసి లోపాలను గుర్తించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. స్మార్ట్‌మీటర్లపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఏపీసీపీడీసీఎల్‌ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 01:53 AM