రోడ్లపైనే తోపుడు బండ్ల వ్యాపారాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:54 AM
అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలం అవుతోంది. పట్టణంలో నుంచే నామ్ రోడ్డు ఉండడంతో భారీ వాహనాలు సైతం ఈ దారిలోనే ప్రయాణిస్తున్నాయి.
అద్దంకి, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలం అవుతోంది. పట్టణంలో నుంచే నామ్ రోడ్డు ఉండడంతో భారీ వాహనాలు సైతం ఈ దారిలోనే ప్రయాణిస్తున్నాయి. నామ్ రోడ్డు నిర్మాణ సమయంలో విస్తరించకుండా, సర్వీస్ రోడ్లు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. ఇది చాలదన్నట్లు అద్దంకి పట్టణంలో తోపుడు బండ్లుపై వ్యాపారాలు ఎక్కువ. దీంతో తోపుడు బండ్ల ను పట్టణంలోని అంబేడ్కర్ బొమ్మకూడలి నుంచి ఎస్‌బీఐ(ఏడిబి) వరకు రెండు వైపులా, పోతురాజు గండి, భవానిసెంటర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. దీంతో అసలే ఇరుకుగా ఉన్న నామ్ రోడ్డు మరింత ఇరుకుగా మారింది. అదే సమయంలో మేదరమెట్లతో పాటు పలు గ్రామాలకు వెళ్లే ఆటోలు సైతం సైతం తోపుడు బండ్ల చెంతనే నిలుపుతున్నారు. దీంతో నామ్ రోడ్డులో ఒక్కొక్క వాహనం మాత్రమే వెళ్లాల్సి వస్తోంది. ఇక పాదచారులు, మోటార్‌సైకిలిస్టులు సైతం నామ్ రోడ్డు మధ్యలో నుంచే వెళ్లాల్సి వస్తోంది. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పలు సందర్భాలలో పాదచారులు, మోటార్ సైకిలిస్టులు ప్రమాదాలకు గురై మృతి చెందడంతో పాటు క్షతగాత్రులుగా మారారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు మరింత రద్దీ ఉన్నా తోపుడు బండ్లు వ్యాపారులు మాత్రం మరింత రోడ్డు మీదనే తోపుడు బండ్లు ఏర్పాటు చేసి దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక భవానిసెంటర్‌లో ప్రమాదకర మలుపు ఉన్నప్పటికీ, రోడ్డు మార్జిన్‌ను పలువురు వ్యాపారులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఇక చికెన్ సెంటర్‌లు, చేపల దుకాణాల వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. రోడ్డు మార్జిన్‌లు సైతం ఆ క్రమించి వ్యాపారాలు చేస్తున్నారంటున్నారు. దీంతో ద్విచ క్ర వాహనచోదకులు రోడ్డు పైనే పార్కింగ్ చేస్తున్నారు. అద్దంకిలో మరో ప్రధాన కూడలి భవాని సెంటర్‌లో తరచూ ట్రాఫిక్ నిలిచి పోతోంది. తోపుడు బండ్లు వ్యాపారులకు నామ్ రోడ్డు వెంబడి కాకుండా ప్రత్యేక స్థలాలు కేటాయిస్తే రోడ్డు విశాలంగా మారి ట్రాఫిక్ సమస్యకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని పలువురు వాహనచోదకులు అభి ప్రాయపడుతున్నారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు విశాలంగా ఉండటం, పట్టణం నడిబొడ్డున ఉన్న నేపథ్యంలో డివైడర్‌కు రెండు వైపులా తోపుడు బండ్లు ఏర్పాటు చేస్తే అటు తోపుడు బండ్ల వ్యాపారులకు, ఇటు ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతు న్నారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి నామ్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూడాలని వాహనచోదకులు అభిప్రాయపడుతున్నారు.