రేపటి నుంచి పల్స్‌పోలియో
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:38 AM
పల్స్ పోలియో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది.
జీరో నుంచి ఐదేళ్లలోపు 2.42 లక్షల మంది గుర్తింపు
జిల్లాకు చేరిన మూడు లక్షల వ్యాక్సిన్ డోస్‌లు
1,945 కేంద్రాల్లో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు
జిల్లావ్యాప్తంగా నేడు అవగాహన ర్యాలీలు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పల్స్ పోలియో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 6.05 లక్షల కుటుంబాల్లో 2,42,112 మంది అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి ఐదేళ్ల లోపు వారు ఉన్నట్లు గుర్తించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లాకు మూడు లక్షల వ్యాక్సిన్ డోసులను పంపింది. ఆ వ్యాక్సిన్స్‌ను ఒంగోలు నుంచి అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశా లలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఈనెల 21న జిల్లావ్యాప్తంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 1,945 కేంద్రాలను సిద్ధం చేశారు. పీపీ యూనిట్లు, అర్బన్, రూరల్, గిరిజన ప్రాంతాలతోపాటు వాహనాల్లో బూత్‌లు, మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. పిల్లలకు పోలియో చుక్కలను వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 7,528 మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నారు. అందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.
ర్యాలీలతో అవగాహనకు చర్యలు
పోలియో చుక్కల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శనివారం జిల్లావ్యాప.్తంగా అవగాహన ర్యాలీలను నిర్వహించేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించనుంది. మొదటి రోజు వైద్యశాలలు, వైద్యశాఖ గుర్తించిన ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. లక్ష్యానికి అనుగుణంగా చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు.