Share News

ప్రజానాయకులు ఎన్టీఆర్‌, దామచర్ల, పరిటాల

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:43 PM

నీతి, నిజాయితీగా పనిచేసి ప్రజల్లో గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నేతలు దివంగత ఎన్టీఆర్‌, ఈ ప్రాంతంలో దామచర్ల ఆంజనేయులు, రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవి అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు.

ప్రజానాయకులు ఎన్టీఆర్‌, దామచర్ల, పరిటాల
మాట్లాడుతున్న మంత్రి అనిత, వేదికపై మంత్రి స్వామి, రవికుమార్‌, ఎంపీ మాగుంట, ఎరిక్షన్‌, కొండయ్య, నాగేశ్వరరావు, బాలాజీ, సత్య, జనార్దన్‌, ఏలూరి

హోం మంత్రి వంగలపూడి అనిత

మర్లపాడులో విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు

కొండపి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నీతి, నిజాయితీగా పనిచేసి ప్రజల్లో గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నేతలు దివంగత ఎన్టీఆర్‌, ఈ ప్రాంతంలో దామచర్ల ఆంజనేయులు, రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవి అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఆదివారం టంగుటూరు మండలంలోని మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవి విగ్రహాలను ఆమె రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ప్రజల చెంతకు రాజకీయాలను తీసుకెళ్లారని, రాజకీయాలకు అనేక వర్గాలు దూరంగా ఉన్న రోజుల్లో సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చి అగ్రనేతలుగా తీర్చిదిద్దారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళలకు స్వయం ఉపాధి, చట్ట సభల్లో స్థానం ఎన్టీఆర్‌ కల్పించారన్నారు. ఆ బాటలోనే సీఎం చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ పథకాల్లో నాలుగు పథకాలను మహిళల కోసమే రూపొందించి నెరవేర్చారని చెప్పారు. ఈ ప్రాంతంలో దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు నీతి, నిజాయితీగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసి ప్రజల్లో చెరగని ముద్రవేశారన్నారు. పరిటాల రవి ప్రజా నాయకుడిగా పేదల అభ్యున్నతికోసం పనిచేశారన్నారు. సభాధ్యక్షుడు ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్లకు విశాలమైన స్థలాలున్నా భవన వసతులు లేవన్నారు. భవన వసతులు కల్పించాలని కోరారు. టంగుటూరు మండలంలోని రాయవారిపాలెంలో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన దాడిలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. హోంమంత్రి సానుకూలంగా స్పందించి రెండు సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. మంత్రులు రవికుమార్‌, స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీలు మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయులు మంచి నేతగా ఈప్రాంతంలో గుర్తింపు పొందారన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ తన తాతకు చెడ్డపేరు రాకుండా ఆయన ఆశయ సాధనకు పనిచేస్తున్నామన్నారు. పర్చూరు, చీరాల, కందుకూరు, గిద్దలూరు ఎమ్మెల్యేలు సాంబశివరావు, ఎం.ఎం. కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, అశోక్‌రెడ్డి, దర్శి, వైపాలెం టీడీపీ ఇన్‌చార్జ్జులు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు, ఒంగోలు మేయర్‌ సుజాత, టంగుటూరు, కొండపి మండలాల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్‌, కొర్రపాటి వసంతరాయుడు, టంగుటూరు మండల నాయకులు బెల్లం జయంత్‌బాబు, కామని విజయ్‌కుమార్‌, బెజవాడ వెంకటేశ్వర్లు మల్లవరప్పాడు గ్రామ టీడీపీ నాయకులు హరిబాబు, వేణు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:43 PM