Share News

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:47 PM

సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, పీఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం రూ.6వేలు మొత్తం సంవత్సరానికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకున్నారు.

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

‘రైతన్నా మీకోసం’లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, పీఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం రూ.6వేలు మొత్తం సంవత్సరానికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ పథకం, వ్యవసాయంలో పంచ సూత్రాలు, వాటి ఆవశ్యకతను వివరించారు. నీటి భద్రతతో సమర్ధవంతమైన నీటి నిర్వహణ బిందు సేద్యానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. మార్కెట్‌లో దేనికి డిమాండ్‌ ఉందో, ఏ పంట వేస్తే ఎక్కువ ధర వస్తుందో ఆ పంటల సాగుకు ప్రోత్సాహం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భూసార పరీక్షల ద్వారా సాగులో విప్లవం, పండించిన పంటకు అదనపు విలువలు జోడించి లాభాలను పెంచడం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ వంటి పంచ సూత్రాలను రైతులకు వివరించారు. రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పరికరాలను అందించడం 2025-26లో రూ.164.158 కోట్ల రాయితీ నిధులతో రైతులకు పరికరాలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఖరీ్‌ఫలో 36లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 6లక్షల మంది రైతుల నుంచి రూ.8,282కోట్లతో కొనుగోలు చేశామని 24గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేశామన్నారు. రబీ 24-25లో 20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రెండు లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.4,575కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో ఏవో నాయక్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

గిద్దలూరు : మండలంలో రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో నిర్వహించారు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి 3, 4 కుటుంబాలను క్లస్టర్లుగా చేసి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. రసాయనిక ఎరువులు తగ్గించాలని పేర్కొంటూ సేంద్రియ వ్యవసాయంపై వ్యవసాయాధికారి విజయభాస్కర్‌రెడ్డి అవగాహన కల్పించారు. కౌలు కార్డుల ఉపయోగాలు, పచ్చిరొట్ట పైర్ల ప్రాముఖ్యత, పంటల బీమాపై వివరణ ఇచ్చారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంపై కూడా అవగాహన కల్పించారు. కొత్తకోట, కొమ్మునూరు, సంజీవరాయునిపేట, గడికోట, ఉయ్యాలవాడలో జరిగిన కార్యక్రమాలలో వ్యవసాయాధికారి పాల్గొన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఉద్యాన, పట్టుపరిశ్రమ, రెవిన్యూ, వెటర్నరీ శాఖల సిబ్బంది పాల్గొని పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

మార్కాపురం రూరల్‌ : రైతన్నకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తహసీల్దార్‌ చిరంజీవి తెలిపారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో సోమవారం రైతన్నా మీకోసం కార్యక్రమంలో తహసీల్దార్‌ రంజీవి, ఎంపీడీవో బాలచెన్నయ్య, ఏవో బుజ్జిబాయి పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు కార్యదర్శి కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

తర్లుపాడు : రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు సేవా కేంద్రల్లో రైతన్న మీకోసం క్లస్టర్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ బాలాజీనాయక్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెనుమార్ఫులు తీసుకొచ్చేందుకు తద్వారా పంట సాగును లాభాసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని జోష్ణదేవి, ఏఈవో దేవేంద్ర గౌడ్‌, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

కంభం : రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం ఏడీఏ బాలాజీ నాయక్‌ తెలిపారు. కంభం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని కంభం, పెద్దనల్లగాల్వ, ఎర్రబాలెం గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మహమ్మద్‌, రైతులు పాల్గొన్నారు.

రైతును రాజును చేయడమే లక్ష్యం : ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల : రైతును రాజుగా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. మండలంలోని చిన్నదోర్నాలలో సోమవారం రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాలను అధిగమించి ఆర్థిక బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంచ సూత్రాలను అవలంబిస్తోందన్నారు.ప్రధానంగా ఉన్న నీటిని సద్వి నియోగం చేసుకునేందుకు బిందు తుంపర సేద్యం చేపట్టడం అందుకు అవసరమైన డ్రిప్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగిలిన వర్గాలకు 90శాతం రాయితీతో అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు అశోక్‌ కుమార్‌రెడ్డి, ఎంపీడీవో ప్రసూనదేవి, ఏడీఏ వెంకటరమణ, వ్యవసాయాధికారి జవహర్‌లాల్‌నాయక్‌, వీఆర్వో నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ఐనేని నాగ మల్లికార్జున, దొడ్డా బాబు, పాలంకయ్య పాల్గొన్నారు.

రాచర్ల : రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని ఎంపీడీవో ఎస్‌.వెంకటరామిరెడ్డి అన్నారు. కార్యాలయంలో ఏవో షేక్‌ మహబూబ్‌బాషా అధ్యక్షతన సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి విధివిధానాలను ఎంపీడీవో వివరించారు. కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

త్రిపురాంతకం : రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి మంచి దిగుబడులు రాబట్టవచ్చని వ్యవసాయాధికారి సంగమేశ్వరరెడ్డి వివరించారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రైతన్నా మీకోసం కారక్రమంలో భాగంగా మండలంలోని చెర్లోపల్లిలో రైతులతో మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయం రైతులకు ఎంతో మేలని వివరించారు. పలుచోట్ల సచివాలయ సిబ్బంది కూడా రైతులతో కలిసి దాని ఉద్దేశాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణమోహన్‌, ఎంపీడీవో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : మండలంలోని అమానిగుడిపాడులో ఏవో నీరజ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడుచిట్యాళ వెంగళరెడ్డి నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి వ్యవసాయ పథకాలను వివరించారు. బ్రోచర్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దివ్య కోటేశ్వరరావు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

పెద్దారవీడు : రైతుల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీవో జాన్‌సుందరం అన్నారు. పెద్దారవీడులోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయం రచ్చబండ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని అధికారులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, నిర్దేశించుకున్న లక్ష్యాలను చదివి వినిపించారు. ఎంపీడీవో జాన్‌ సుందరం మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి వ్యవసాయరంగంలో సాంకేతికను ప్రోత్సహిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దిలీ్‌పకుమార్‌, ఏవో ఎన్‌.లక్ష్మీనారాయణ, టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి గొట్టం శ్రీనివాసులరెడ్డి, నాయకులు రామనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, సిబ్బం ది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:48 PM