పోలీసుపై ప్రజలలో విశ్వాసం పెరగాలి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:45 PM
ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా పోలీసులు పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. సోమవారం నగర శివారు ప్రాంతంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది.
రెవెన్యూ, పోలీసు శాఖలు సమష్టిగా కృషి చేయాలి
పోలీసు వార్షిక నేర సమీక్షా సమావేశంలో కలెక్టర్
ఉత్తమ సేవలు అందించిన వారికి రివార్డులు
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం : ఎస్పీ
ఒంగోలు క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా పోలీసులు పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. సోమవారం నగర శివారు ప్రాంతంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేర నియంత్రణతోపాటు సత్వర విచారణ చేపట్టి బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలు పక్కాగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి మన్ననలు పొందాలన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజలకు మంచి పరిపాలన అందిచాలని చెప్పారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసి విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ పోలీసు శాఖ పనితీరు సంతృప్తినిచ్చిందని, వచ్చే ఏడాది పనితీరు మరింత మెరుగుపరుచుకొని ముందుకు సాగాలని చెప్పారు. అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని కేసులు దర్యాప్తు చేయాలని చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కేసులు తగ్గాయన్నారు. జిల్లా అదనపు జడ్జి రాజా వెంకటాద్రి మాట్లాడుతూ కొత్త చట్టాలకు అనుగుణంగా సాక్ష్యాధారాలను సేకరించాలని చెప్పారు. నిందితులకు శిక్షలు పడేవిధంగా విచారణ చేసి కోర్టులో సీడీలను దాఖలు చేయాలన్నారు. తొలుత 2025లో జరిగిన నేరాలపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ మహిళ రక్షణకు పెద్ద పీటవేయాలని కోరారు. రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్టాప్ అండ్ వాష్ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు సంఖ్య తగ్గిందన్నారు. అనంతరం ముఖ్యమైన కేసులలో శిక్షలు పడేవిధంగా ప్రతిభ చూసిన వారికి, ఫైరింగ్‌లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి, సాక్ష్యాలు సేకరించి కేసులలో శిక్షలు పడేలా కృషి చేసిన పీపీలు, ఏపీపీలకు రివార్డులతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయిఈశ్వర్‌యశ్వంత్, రమణకుమార్, కే శ్రీనివాసరావు , జీ గురునాథబాబు, ప్రాషిక్యూషన్ డీడీ వై.ప్రశాంతికుమారి, జిల్లా ిపీపీఎం అజయ్‌కుమార్, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.