నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:25 PM
జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గానికి మరిన్ని నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయన శుక్రవారం సచివాలయంలో కలిసి నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయనకు వివరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
సానుకూలంగా స్పందించిన సీఎం
గిద్దలూరు టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గానికి మరిన్ని నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయన శుక్రవారం సచివాలయంలో కలిసి నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయనకు వివరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు సానుకూలంగా స్పందించి గిద్దలూరు అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ప్రధానంగా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో పట్టణ నడిబొడ్డులో నిరంతరం వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గేటుకు అవతలవైపు రెండు మండలాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగించాలంటే కష్టసాధ్యంగా మారిందని, ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ రైల్వేగేటు సమస్య పరిష్కారానికి చొరవచూపుతానన్నారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం మీదుగా వెళ్లే సగిలేరు వాగు వలన వరదలు వచ్చే సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని, ఇందుకు రిటైనింగ్ వాల్‌తో పాటు పలు చోట్ల చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని బేస్తవారపేట నుంచి కోనపల్లె, కొమరోలు నుంచి శింగరపల్లె, ఆకవీడు నుంచి పాపినేనిపల్లి రహదారులను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి ఎక్కువ శాతం సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించి గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.