ఎంఈవోల నియామకంపై నిరసన గళం
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:25 PM
మండల విద్యాధికారులు-1గా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు.
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నిర్ణయం
న్యాయ పోరాటానికి నిర్ణయం
ఒంగోలు విద్య, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : మండల విద్యాధికారులు-1గా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక ప్రధానోపాధ్యాయుల సంఘ భవన్‌లో ఆదివారం ఫ్యాప్టో, జాక్టో, ప్రధానోపాధ్యాయుల సంఘం, ఎంఈవోల సంఘం ఉమ్మడి ఐక్యవేదికను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకే డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో ఖాళీలను బట్టి నియమిస్తారన్నారు. వీరిలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లను మాత్రమే రెగ్యులర్, ఇన్‌చార్జి ఎంఈవో-1లుగా నియమిస్తూ పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరికాదన్నారు. కేవలం ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2005లో ప్రభుత్వం జారీ చేసిన 205, 208 జీవోల ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు పులి శ్రీనివాసరావు, నరహరి అంజిరెడ్డి, మల్లికార్జునరావు, అబ్దుల్ హై, రఘు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, వై.వెంకట్రావు, జీఎ్‌సఆర్ సాయి, శ్రీనివాసరావు, టి.కిషోర్‌బాబు, నాగేంద్రవదన్ పాల్గొన్నారు.