కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:18 AM
జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే గ్రామపంచాయతీల విభజన ఉంటే ఆ ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాద నలను పంపాలని ఆదేశించింది.
రేపటితో ముగియనున్న గడువు
ఇప్పటి వరకూ అధికారులకు అందిన దరఖాస్తులు 38
పరిగణనలోకి ఆరు మాత్రమే.. మిగిలినవి తిరస్కరణ
మళ్లీ నిబంధనల ప్రకారం పంపాలని సూచన
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే గ్రామపంచాయతీల విభజన ఉంటే ఆ ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాద నలను పంపాలని ఆదేశించింది. తదనుగుణంగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. జిల్లాలో ప్రస్తుతం 729 పంచాయతీలు ఉండగా విభజన కోసం ఇప్పటికే అధికారులకు నిబంధనల ప్రకారం ఆరు దరఖాస్తులు అందాయి. ఈనెల 22 వరకూ ప్రభుత్వం ప్రతిపాదనల స్వీకరణకు గడువు ఇచ్చింది. దీంతో అవసరమైన చోట వెంటనే ప్రతిపాదనలు స్వీకరించి పంపించాలని డీపీవో వెంకటేశ్వరరావు ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2వతేదీ వరకు ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ఉంది. ప్రస్తుత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసేవి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ ఏర్పాటు కావాలంటే గ్రామంలో జనాభా, వనరులు, ప్రస్తుత పంచాయతీకి ప్రతిపాదిత గ్రామానికి మధ్య దూరం, రెవెన్యూ సర్వే నంబర్ల విభజన తదితర అంశాలన్నింటిని అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. రెండు పంచాయతీలను ఒకటిగా మార్చడం, పంచాయతీలోని గ్రామాన్ని మరో గ్రామపంచాయతీలోకి విలీనం చేసే ప్రతిపాదనలను కూడా స్వీకరించనున్నారు. పంచాయతీల విభజనకు సంబంధించి జిల్లా నలుమూలల నుంచి ఇప్పటివరకు సుమారు 38 దరఖాస్తులు అందాయి. వాటిలో 32 ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో వెనక్కు పంపారు. ఆరింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంపీడీవోల ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను పంపించాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. పంచాయతీల విభజనకు సంబంధించి మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈలోపు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఆమోదముద్ర తర్వాత ప్రభుత్వానికి పంపనున్నారు.