పక్కాగా రేషన్ పంపిణీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:22 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. పక్కాగా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. తాజాగా బయోమెట్రిక్ (వేలిముద్రలు వేసే మిషన్) స్థానంలో సాంకేతిక పరిజ్ఞానంతో (లేటెస్ట్ అప్‌డేట్) స్మార్ట్‌మిషన్‌ను అందుబాటులోకి తెస్తోంది.
పలు మార్పులు తెస్తున్న ప్రభుత్వం
బయోమెట్రిక్ స్థానంలో స్మార్ట్‌మిషన్
వచ్చేనెల నుంచి కొత్త కార్డులతో సరుకులు
చర్యలు చేపట్టిన అధికారులు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. పక్కాగా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. తాజాగా బయోమెట్రిక్ (వేలిముద్రలు వేసే మిషన్) స్థానంలో సాంకేతిక పరిజ్ఞానంతో (లేటెస్ట్ అప్‌డేట్) స్మార్ట్‌మిషన్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా కార్డుదారులు సత్వరమే రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బయోమెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్రలు పడక గంటల తరబడి షాపుల వద్దనే పడిగాపులు కాయాల్సివస్తోంది. కొత్త విధానంలో అలాంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
కార్డు స్కాన్‌తో సరుకులు
కార్డుదారులు చౌకధరల దుకాణాల వద్దకు వెళ్లాక వేలిముద్రలు పడకపోతే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మిషన్ ద్వారా రైస్‌కార్డును స్కాన్ చేసి రేషన్ ఇస్తారు. దీని వలన రేషన్ పక్కదారి పట్టకుండా నిలువరించడంతోపాటు కార్డుదారులకు సులభతరంగా సరుకులు పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్న కార్డులతోనే బియ్యం ఇస్తుండగా వచ్చేనెల నుంచి కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే స్టార్ట్ కార్డులు ప్రింట్ చేసిన సంస్థలకు మండలాల వారీ చిరునామాలు కూడా ఇచ్చారు. అవి నేరుగా మండలాలకు చేరిన తర్వాత పంచాయతీల వారీగా విభజించి పౌరసరఫరాల శాఖ అధికారుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్పులు, చేర్పులకు భారీగా దరఖాస్తులు
రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా 94,129 దరఖాస్తులు వచ్చాయి. అందులో ప్రస్తుతం ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పుల కోసం అత్యధికంగా 65,737 ఉన్నాయి. వాటిలో 39,722 దరఖాస్తులను అధికారులు ఆమోదించగా 7,002 తిరస్కరించారు. మిగిలినవి విచారణలో ఉన్నాయి. కొత్త రైస్‌కార్డుల కోసం 10, 457 దరఖాస్తులు అందగా 6,717ను ఆమోదించారు. 3,454 తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. అలా ఆమోదించిన దరఖాస్తుల్లో ఈ నెలలోనే సుమారు 20శాతం మందికి సరుకులు తీసుకునేందుకు అవకాశం కలిగింది. ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తులకు నంబర్లు కూడా రావడంతో కొత్త కార్డుదారులు ఆయా రేషన్ షాపుల వద్ద బయోమెట్రిక్ వేసి బియ్యాన్ని తీసుకున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పౌరసరఫరాల శాఖలలో అనేక మార్పులు తేవడంతోపాటు కార్డుదారులకు పారదర్శకంగా బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టింది.