Share News

పంచాయతీరాజ్‌లో ప్రమోషన్ల సందడి

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:21 PM

పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగోన్నతుల సందడి నెలకొంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో అనేక సంస్కరణలు తెచ్చింది.

పంచాయతీరాజ్‌లో ప్రమోషన్ల సందడి

జిల్లాలో అన్ని కేడర్లలో కలిపి 500 మందికిపైగా ఉద్యోగోన్నతులు

పాలనలో సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం

ఒంగోలు కల్టెరేట్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగోన్నతుల సందడి నెలకొంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో అనేక సంస్కరణలు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రచరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేస్తున్న పంచాయతీరాజ్‌ ఉద్యోగుల్లో అన్ని కేడర్ల వారికి ఉద్యోగోన్నతులు కల్పిస్తోంది. పంచాయతీరాజ్‌లోని అధికారులు, ఉద్యోగులు ఏళ్లతరబడి ప్రమోషన్లు లేకుండా చేరిన పోస్టులోనే ఉద్యోగ విరమణ చేయాల్సిన పరిస్థితులు ఇప్పటి వరకూ కొనసాగుతున్నాయి. తాజాగా ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందలాది మందికి ఉద్యోగోన్నతులు లభిస్తున్నాయి. గతంలో ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతుల అవకాశం లేకపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉండేవారు. ప్రస్తుతం వారు డివిజనల్‌ స్థాయి ప్రమోషన్‌ పొందుతున్నారు. అలా జిల్లాలో సుమారు 16 మంది ఎంపీడీవోలకు పైస్థాయి అధికారులుగా ఉద్యోగోన్నతులు లభించాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీరాజ్‌ శాఖల్లో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్ల వరకు డిప్యూటీ ఎంపీడీవోల హోదా లభించింది. వారిని మండల కార్యాలయాల్లో నియమించడంతోపాటు ప్రత్యేకంగా పోస్టులను సృష్టించి 38 మందిని సచివాలయాలకు పర్యవేక్షకులుగా నియమించారు. గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న 52 మంది కార్యదర్శులను గ్రేడ్‌-5గా, గ్రేడ్‌-5లను గ్రేడ్‌-4లుగా 88మందికి ఉద్యోగోన్నతి లభించింది. ఇలా ప్రతి కేడర్‌లోనూ ఏదో ఒక స్థాయిలో ఉద్యోగోన్నతి లభించింది.


పది మంది డీడీవోలకు ఉద్యోగోన్నతి

కిందిస్థాయిలో మాత్రమే కాకుండా డివిజనల్‌ స్థాయిలో పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న డివిజనల్‌ డెవల్‌పమెంట్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో) స్థాయి అధికారులకు ఉద్యోగోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 150మంది వరకు జిల్లా స్థాయి అధికారులుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. అందులో మన జిల్లాకు చెందిన వారు పది మంది వరకు ఉన్నారు. సీనియారిటీ జాబితాలో ఉన్న డీడీవోలకు ఈ నెలాఖరులోపు ప్రమోషన్లు కల్పించి రాష్ట్రంలో జోనల్‌ స్థాయి పరిధిలో ఖాళీగా ఉండే జిల్లా పరిషత్‌ సీఈవో, డిప్యూటీ సీపీవో, డీపీవోతోపాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే పోస్టుల్లో నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రస్తుతం ఉద్యోగోన్నతులు పొందనున్న డీడీవోలను కూడా జిల్లాకు ఒకరిని నియమించనున్నారు. ఇలా పంచాయతీరాజ్‌ శాఖలో పలు సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది.

Updated Date - Dec 14 , 2025 | 11:21 PM