Share News

శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు రూపొందించాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:42 AM

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు సమీపంలోని సాయిబాబా సెంట్రల్‌ స్కూలులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి జేసీ ప్రారంభించారు.

శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు రూపొందించాలి
విద్యార్థి ప్రదర్శించిన ప్రాజెక్టు గురించి తెలుసుకుంటున్న జేసీ గోపాలకృష్ణ

జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ

సైన్స్‌ఫెయిర్‌కు 300పైగా ప్రదర్శనలు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు సమీపంలోని సాయిబాబా సెంట్రల్‌ స్కూలులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి జేసీ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు తయారుచేసిన 300 ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. వాటిని సందర్శించిన జేసీ గోపాలకృష్ణ వాటికి సంబంధించిన అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకోవడంతో వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో కూడా ప్రాజెక్టులు తయారుచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి రేణుక అధ్యక్షతన జరిగిన సభలో జేసీ మాట్లాడుతూ ప్రాజెక్టుల తయారీలో విద్యార్థుల ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను అభినందించారు. స్థానిక సమస్యలకు స్థానికంగా పరిష్కారాలు కనుగొనే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు, మార్కాపురం ఉపవిద్యాధికారులు ఎ.చంద్రమౌళీశ్వర్‌, ఎం.శ్రీనివాసులు, డీసీఈబీ కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, జిల్లా సైన్స్‌ అధికారి టి.రమేష్‌, ఒంగోలు ఎంఈవో కిషోర్‌బాబు, ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌ పిన్నిక మదుసూదన్‌రావుతోపాటు పలు మండలాల విద్యాధికారులు, హెచ్‌ఎంలు, సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంతోపాటు సమీప మండలాల్లోని విద్యార్థులు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

Updated Date - Dec 20 , 2025 | 01:42 AM