మాయ‘దారి’ సమస్యలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:25 PM
అది అత్యంత కీలకమైన ఒంగోలు-నంద్యాల జాతీయ రహదారి. నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. అలాంటి ముఖ్యమైన రహదారి పొదిలి మండలంలో అధ్వానస్థితికి చేరింది.
అది అత్యంత కీలకమైన ఒంగోలు-నంద్యాల జాతీయ రహదారి. నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. అలాంటి ముఖ్యమైన రహదారి పొదిలి మండలంలో అధ్వానస్థితికి చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఛిద్రమైంది. చాలాచోట్ల మోకాలిలోతు నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మార్కాపురం అడ్డరోడ్డు నుంచి విశ్వనాథపురం వరకు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటం వలన గోతులు కనిపించక వాహనదారులు తరచూ ప్రమదాలబారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికితోడు రోడ్డుకు ఇరువైపులా సైడుకాలువల లేకపోవడంతో దుకాణాల ముందు యజమానులు మెరక కోసం మట్టి తోలడంతో రోడ్డు పల్లంగా మారింది. ముఖ్యంగా పెట్రోల్ బంక్ నుంచి ఆంజనేయస్వామి గుడి వరకు కొద్దిపాటి వర్షానికే చెరువును తలపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పట్టణ పరిధిలో మున్సిపల్ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి అక్కడక్కడా తక్షణ మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం రోడ్డు దుస్థితి నానాటికీ దిగజారుతోంది. మర్రిపూడి అడ్డరోడ్డు వద్ద భారీ గుంతపడటంతో మునిసిల్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఉప్పలపాడులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. బస్టాండ్ సెంటర్ కావడంతో ప్రయాణికులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - పొదిలి, ఆంధ్రజ్యోతి