ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , Publish Date - May 02 , 2025 | 11:47 PM
తిరుమల నుంచి విశాఖకు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయరహదారి పక్కన బోల్తాపడింది. ఈ సంఘటన మార్టూరు మండలం రాజుపాలెం రెస్ట్ ఏరియా సమీపంలో శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది.
తిరుమల నుంచి విశాఖ వస్తుండగా ప్రమాదం
తమిళనాడులో పలు పుణ్యక్షేత్రాలనూ దర్శించుకున్న భక్తులు
బాధితులు వైజాగ్, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారే
స్వల్వగాయాలతో బయటపడిన ప్రయాణికులు
మార్టూరు, మే 2(ఆంధ్రజ్యోతి) : తిరుమల నుంచి విశాఖకు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయరహదారి పక్కన బోల్తాపడింది. ఈ సంఘటన మార్టూరు మండలం రాజుపాలెం రెస్ట్ ఏరియా సమీపంలో శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ముందు వెళుతున్న లారీ అకస్మాత్తుగా కుడివైపునకు తిరగడంతో, వెనుక నుంచి వస్తున్న బస్సు డ్రైవరు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లి ఆరుఅడుగుల గోతిలో పడింది. ఆ సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో దాదాపు మూడొంతుల మంది మహిళలే. వారంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి మార్టూరు సీఐ శేషగిరిరావు తన సిబ్బందితో వెళ్లారు. వెంటనే హైవే అంబులెన్స్, హైవే మొబైల్ పోలీసులు, 108 వాహనం సిబ్బంది వచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన 13 మంది మహిళలను, ఇద్దరు పురుషులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని సమీపంలోని రెస్ట్ట్ ఏరియాకు తరలించారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో పోలీసులు బోల్తాపడిన బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రయాణికులు బస్సులోని సామాన్లు తీసుకున్నారు. అనంతరం వారందరినీ వైజాగ్ వైపు వెళ్లే ఆర్‌టీసీ బస్సులలో పోలీసులు పంపించారు.
గత నెల 9న విశాఖ నుంచి బయలుదేరి...
గత నెల 9న విశాఖ నుంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని 38 మంది ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. భీమలి మండలం ఉప్పాడ, చిట్టివలస, భోగాపురం మండలం గుడివాడ, తూర్పుగోదావరి జిల్లా కాట్రేని కోన మండలం దర్శితిప్ప, అమలాపురం తదితర గ్రామాలకు చెందిన వారు రామేశ్వరం, కంచి, మధుర, అరుణాచలం తదితర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. గురువారం తిరుమల వచ్చి వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకున్నారు. రాత్రికి బస్సులో విశాఖకు బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. డ్రైవరు ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు.