449మందికి ప్రాధాన్యత కేటగిరీ బదిలీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:23 AM
ఉమ్మడి జిల్లాలో వచ్చేనెలలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో 449 మంది ప్రాధాన్యత కేటగిరీలో ఉన్నారు. శారీరక వైకల్యం, వ్యాధులతో బాధపడుతున్న టీచర్లకు ఈ కేటగిరీలో బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈమేరకు ఏపీ ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం-25ను అమలులోకి తెచ్చింది.
సర్టిఫికెట్లు జారీచేసిన మెడికల్ బోర్డు
దివ్యాంగ టీచర్ల ఇబ్బందులు
ఒంగోలు విద్య, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో వచ్చేనెలలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో 449 మంది ప్రాధాన్యత కేటగిరీలో ఉన్నారు. శారీరక వైకల్యం, వ్యాధులతో బాధపడుతున్న టీచర్లకు ఈ కేటగిరీలో బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈమేరకు ఏపీ ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం-25ను అమలులోకి తెచ్చింది. 56శాతానికి పైగా శారీరక వైకల్యం ఉన్నవారు, దీర్ఘకాలిక తీవ్ర వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్న వారు ఈ కేటగిరీ కింద ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని టీచర్లలో శారీరక వైకల్యం, వ్యాధులతో బాధపడుతున్న వారిని నిర్ధారించి వైద్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ఈనెల 24 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. 449మంది హాజరయ్యారు. వీరికి మంగళవారం స్థానిక రిమ్స్‌లో ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఫీజు వసూలు
బదిలీల్లో ప్రాధాన్యత కేటగిరీ కింద లబ్ధి పొందేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రిమ్స్‌లో లిఫ్ట్‌లు మొరాయించ డంతో మూడో అంతస్తు మెట్లు ఎక్కేం దుకు ఇబ్బందులు పడ్డారు. సర్టిఫికెట్లు ఇచ్చే వద్ద కూడా ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో నిల్చోలేనివారు నేలమీద కూర్చోవాల్సి వచ్చింది. వైద్య ధ్రువీకరణ పత్రాలకు టీచర్ల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని విద్యాశాఖ కమిషనర్, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కానీ ఒక్కో టీచర్ నుంచి రూ.2,500 వసూలు చేశారు. ఈ మొత్తాన్ని డిజిటల్‌గా చెల్లించేందుకు అవకాశం లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక కొందరు ఏటీఎంలకు పరుగులు తీసి డ్రా చేసి చెల్లించి నగదు రసీదు, వైద్య సర్టిఫికెట్లు తీసుకున్నారు.
వైద్య ధ్రువీకరణ పత్రాల అందజేత
ఉమ్మడి జిల్లాలో 449 మందికి వైద్య ధ్రువీకరణ పత్రాలకు అర్హత లభించింది. దృష్టి లోపం, సంబంధించి సర్టిఫికెట్లు మంగళవారం జారీ చేయలేదు. వీటికి సంబంధించిన సమాచారం జిల్లా విద్యాశాఖ తర్వాత ప్రకటించనుంది.
కేటగిరీల వారీగా అర్హత పొందిన టీచర్ల వివరాలు ఇవీ.
56 నుంచి 69 శాతం వరకు శారీరక వికలాంగులు అత్యధికంగా 103మంది
56 నుంచి 69శాతం దృష్టిలోపం ఉన్నవారు 18 మంది
56 నుంచి 69శాతం వినికిడిలోపం ఉన్నవారు 26 మంది
70 శాతం ఆపైన దృష్టిలోపం ఉన్నవారు 32మంది
శారీరక వైకల్యం ఉన్నవారు 29 మంది
వినికిడి లోపం ఉన్నవారు 13 మంది
80శాతంపైన శారీరక వైకల్యం గలవారు 41మంది, దృష్టిలోపం ఉన్నవారు 21 మంది
క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు 45 మంది
ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆవయవ మార్పిడి చేయించుకున్నవారు 72 మంది
మేజర్ న్యూరో సర్జరీ చేయించుకున్న వారు 24 మంది
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న వారు నలుగురు
స్పైనల్ సర్జరీ చేయించుకున్న వారు 18 మంది
మానసిక రుగ్మతతో చికిత్స పొందుతున్న పిల్లల భార్యభర్తలు ఉన్నవారు ఒకరు
జువైనల్ డయాబెటిస్, హిమోఫీలియా, కండరాలు పట్టివేత, తలసేమియా వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న పిల్లలు ఉన్నవారు ఒకరు.