ధర రూ. 266.. అమ్ముతోంది రూ.300
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:04 AM
సాగు సమయం ఆసన్నమైంది.. రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు.. ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది
కొత్తపట్నంలో యూరియా విక్రయాల్లో వ్యాపారుల ఇష్టారాజ్యం
జేసీ తనిఖీల్లో బహిర్గతం
కేసు నమోదు చేసిన అధికారులు
కొత్తపట్నం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి) : సాగు సమయం ఆసన్నమైంది.. రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు.. ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిలువుదోపిడికీ దిగుతున్నారు. ఎరువులు పురుగుమందుల దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు అధిక ధరలకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యమైంది. దీనిపై ఫిర్యాదులు అందుకున్న జేసీ గోపాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగారు. మంగళవారం కొత్తపట్నంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో వ్యాపారుల అసలు గుట్టురట్టయ్యింది. యూరియా బస్తా రూ.266కు అమ్మాల్సి ఉండగా రూ.300కు అమ్ముతున్నారు. కొత్తపట్నంలోని శివాలయం వీధిలో ఉన్న షా ఎంటర్‌ప్రైజెస్ దుకాణాన్ని జేసీ తనిఖీ చేశారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యూరియా బస్తా ఎంతకు అమ్ముతున్నారంటూ వాకబుచేశారు. రూ.300లకు విక్రయిస్తున్నారని చెప్పటంతో షా ఎంటర్‌ప్రయిజెస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అంతేగాక దుకాణంలో ఉన్న 4.86 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్ చేశారు. అనంతరం ఆయన రాజుపాలెంలోని బాలాజీ ఏజెన్సీ్‌సలోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలోని రైతులతో కూడా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయశాఖాధికారి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి కిషోర్‌బాబు తదితరులు ఉన్నారు.