Share News

‘ఉపాధి’ కోసం ఒత్తిళ్లు

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:20 PM

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా పనులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు మాసాలు పూర్తయినప్పటికీ ఆ పనులు మంజూరు చేయకపోవడంపై గ్రామస్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘ఉపాధి’ కోసం ఒత్తిళ్లు
మెటీరియల్‌ కాంపౌండ్‌ నిధులతో వేస్తున్న సిమెంట్‌ రోడ్డు (ఫైల్‌)

మెటీరియల్‌ కోటాకు భారీ డిమాండ్‌

రూ.400 కోట్ల పనులకు నేతల సిఫార్సు

ఒక్క వైపాలెం నియోజకవర్గం నుంచే రూ.123 కోట్లకు ప్రతిపాదనలు

గత ఏడాది రూ.180కోట్లకుపైగా పనులు

దాదాపు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌

అయినా భారీగా కోరుతున్న నేతలు

నిధులు అందుబాటులో లేక అధికారుల అవస్థలు

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా పనులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు మాసాలు పూర్తయినప్పటికీ ఆ పనులు మంజూరు చేయకపోవడంపై గ్రామస్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను కలిసి వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నారు. దీంతో వారు జిల్లా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి దాదాపు రూ.400 కోట్ల విలువైన పనుల మంజూరు కోరుతూ వివిధ స్థాయి నేతల నుంచి డ్వామా అధికారులకు సిఫార్సులు అందినట్లు సమాచారం. అందులో 10 శాతానికి మించి మెటీరియల్‌ కోటా నిధులు మంజూరు చేసేందుకు అధికారుల వద్ద నిధులు అందుబాటులో లేకపోవడంతో వారు తలలుపట్టుకుంటున్నారు.

ఒంగోలు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014-19) ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకించి జిల్లాలో భారీగా పనులు జరిగాయి. అప్పట్లో వందలాది గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైన్లు, పాఠశాలల ప్రహరీలు, మినీ గోకులాలు, ఇతరత్రా నిర్మాణాలు ప్రత్యేకించి పెద్దఎత్తున శ్మశానాల అభివృద్ధి చేశారు. ఇంచుమించు వెయ్యి కోట్ల విలువైన పనులు అప్పట్లో జరిగాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక ఆ తరహా పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది (2024-25)లో జిల్లాలో సుమారు రూ.180 కోట్లకుపైగా పనులు చేశారు. నియోజకవర్గానికి సగటున రూ.15 కోట్ల వంతున రూ.120 కోట్ల పనులను అప్పటి కలెక్టర్‌ మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రత్యేకంగా రూ.37 కోట్ల పనుల మంజూరుతోపాటు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచనలు, ఎంపీ మాగుంట ప్రతిపాదించిన కొన్ని పనులు, పశువుల షెడ్లు, ఇతరత్రా నిర్మాణాలకు మరికొంత ఇచ్చారు. మొత్తంగా రూ.180 కోట్లకుపైగా పనులు జరిగాయి. అయితే వాటిలో దాదాపు రూ.100 కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

భారీగా ప్రతిపాదనలు

ఉపాధి మెటీరియల్‌ కోటా పనులపై గ్రామస్థాయి అధికార పార్టీ నేతల నుంచి ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. నేరుగా నేతలు ఆ పనులు చేసుకునే అవకాశం ఉండటంతోపాటు గ్రామంలో పనులు చేయించామని చెప్పుకునేందుకు వారు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు.. కలెక్టర్‌, డ్వామా పీడీలకు సిఫార్సు చేస్తూ పనుల వివరాలు పంపుతున్నారు. మరికొందరు ఏకంగా సీఎం కార్యాలయంతోపాటు డిప్యూటీ సీఎం, ఎంపీ కార్యాలయం, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి సైతం సిఫార్సు లేఖలతో పనులు మంజూరు కోరుతూ అధికారుల వద్దకు వస్తున్నారు. అలా దాదాపు రూ.400 కోట్ల విలువైన పనుల మంజూరు కోసం అధికారులకు ఇప్పటికే సిఫార్సులు అందాయి. అందులో ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచే రూ.123 కోట్ల విలువైన పనులు ఉన్నాయి. ఎంపీ కార్యాలయం నుంచి రూ.50 కోట్లు, కనిగిరి నియోజకవర్గం నుంచి మరో రూ.40 కోట్లు, దర్శి నుంచి రూ.48 కోట్లు, మార్కాపురం నుంచి రూ.50 కోట్లు ఇలా భారీగా ప్రతిపాదనలు అందినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత అధికారులు మంజూరుపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.


పనుల మంజూరుపై సందిగ్ధంలో అధికారులు

మెటీరియల్‌ కోటా నిధులు ఆశించిన మేర అందుబాటులో లేకపోవడం, గతంలో 2014-19 మధ్య చేసిన పనులకు పెండింగ్‌ బిల్లులను వైసీపీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వాటిని ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక చెల్లించడం వంటి కారణాలతో గత ఏడాది చేసిన పనులకు నిధుల కొరత ఏర్పడింది. అలా సుమారు రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రూ.50 కోట్ల మేర చెల్లింపునకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అధికారులు సదరు బిల్లులను అప్‌లోడ్‌ చేశారు. కొద్ది మందికి ప్రస్తుతం అవి జమ అవుతున్నట్లు తెలుస్తోంది. అవి వచ్చినా ఇంకా రూ.50 కోట్ల మేర పెండింగ్‌ ఉన్నాయి. అలాగే డ్వామా పరంగా చేపట్టే ప్లాంటేషన్‌, హౌసింగ్‌, పశువుల షెడ్లు, ఇతరత్రా వాటికి సంబంధించి మరో రూ.20 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది పనుల మంజూరుపై అధికారులు సందిగ్ధంలో పడ్డారు.

Updated Date - Dec 14 , 2025 | 11:22 PM