సమస్యల పరిష్చ్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:57 PM
ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిచేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి) : ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిచేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. మొత్తం 174 అర్జీలు అందజేయగా వాటిల్లో 119 రెవెన్యూ పరమైన సమస్యలు కాగా మిగిలినవి విద్యుత్, గృహనిర్మాణం, పింఛన్లు, వాహనమిత్ర తదితర సమస్యలకు సంబంధించినవిగా గుర్తించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకతీతంగా వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకుసాగుతున్నామన్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజలు వివరించిన సమస్యలను నోట్ చేసుకున్నామని, అన్నీ సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సైతం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సాధ్యం కాని పనుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో పేద ప్రజల వైద్యం ఖర్చులకు దాదాపు 1000 మందికి కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఇప్పటికే అందజేశామన్నారు. త్వరలో దొనకొండ మంచి పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చెందబోతుందని చెప్పారు. ఇటీవల సీఎం ప్రకటించిన బీడీఎల్ సంస్థ ఆధ్వర్యంలో రక్షణ రంగ పరిశ్రమ త్వరలో ఏర్పాటు కాబోతుందన్నారు. అనంతరం ఆరుగురికి సీఎం సహాయ నిధి చెక్కులను, 70 మంది పారిశుధ్య కార్మికులకు, 15 మంది తుఫాన్ బాధితులకు అసిస్టు సంస్థ అందజేసిన బియ్యం, కందిపప్పు, నూనె తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో వసంతరావునాయక్, ఎస్‌ఐ త్యాగరాజు, నేతలు మోడి ఆంజనేయులు, నాగులపాటి శివకోటేశ్వరరావు, మోడి వెంకటేశ్వర్లు, శృంగారపు నాగసుబ్బారెడ్డి, పులిమి రమణాయాదవ్, మగ్భూల్‌అహమ్మద్ పాల్గొన్నారు.