Share News

చీరాల్లో రాజకీయ ఫ్లెక్సీల రగడ

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:02 PM

నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీల రగడ రాజుకుంటోంది. చీరాల పట్టణంలో వైసీపీ ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకోగా, వేటపాలెంలో అధికార పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి.

చీరాల్లో రాజకీయ ఫ్లెక్సీల రగడ
వైసీపీ ఫ్లెక్సీను తొలగిస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది

పట్టణంలోని వైఎస్‌ విగ్రహం వద్ద ముందుగా వైసీపీకి చెందిన ఫ్లెక్సీ ఏర్పాటు

వర్ధంతి కార్యక్రమాలకు అడ్డుగా ఉందని ఆ పార్టీలోనే మరో వర్గం అధికారులకు ఫిర్యాదు

వేటపాలెంలో కాకరేపుతున్న అఽధికార పార్టీ ప్లెక్సీలు

చీరాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీల రగడ రాజుకుంటోంది. చీరాల పట్టణంలో వైసీపీ ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకోగా, వేటపాలెంలో అధికార పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. వైఎస్‌ వర్ధంతికి సంబంధించి రెండు రోజులు ముందుగానే పట్టణంలోని ఏడో వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు పేర్లి నాని గడియార స్తంభం కూడలిలోని రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ప్లెక్సీ ఏర్పాటు చేశారు. వేడుకలు జరుపుకునేందుకు విగ్రహానికి ఫ్లెక్సీ అడ్డుగా ఉందని, వెంటనే తొలగించాలని వైసీపీ జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షులు వాసుమళ్ల వాసు, పట్టణ అధ్యక్షులు యాతం మధుకర్‌(మేరీబాబు) మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వెంటనే ఆ ఫ్లెక్సీను తొలగించారు. ఈ చర్యతో అంతర్గతంగా చీరాల వైసీపీలో కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి.

వేటపాలెంలో శ్రుతి మించిన ఫ్లెక్సీలు

వేటపాలెం మండలంలో పలుచోట్ల అధికార పార్టీకు చెందిన ఫ్లెక్సీలపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాడర్‌తో సంబంధంలేని వ్యక్తులు ఎమ్మెల్యే కొండయ్య, పార్టీ అధికార ప్రతినిధి మహేంద్రనాధ్‌లు బొమ్మలను చిన్నవిగా ముద్రించి ఓ వ్యక్తి తన ఫొటోను పెద్దవిగా పెట్టించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో కాకరేపాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తికి పార్టీ మూలాలకు కూడా సంబంధం లేదని టీడీపీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. పైగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తి గత ఎంఎల్‌సీ ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ వేసుకున్న టెంట్లపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. అటువంటి వారు నేడు అధికార పార్టీతో చేతులు కలపడంతో పాటు ప్రజాప్రతినిధులను మించి ఫ్లెక్సీలు వేయించుకోవడం చర్చనీయాంశమైంది.

Updated Date - Sep 03 , 2025 | 11:02 PM