ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:20 PM
సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని అంబేడ్కర్ నగర్ 3వ లైన్‌లో ఈ నెల 23 తేదీ అర్ధరాత్రి ఒంటరి మహిళ చెరుకూరి సుబ్బాయమ్మ(57) హత్య చేసిన నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 3లక్షలు విలువచేసే 30 గ్రాముల బంగారు ఆభరణాలను, సెల్‌ఫోన్, రూ.960, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు
ముగ్గురు నిందితుల అరెస్ట్
రూ. 3లక్షలు విలువచేసే బంగారం స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీఐ హజరత్తయ్య
సింగరాయకొండ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని అంబేడ్కర్ నగర్ 3వ లైన్‌లో ఈ నెల 23 తేదీ అర్ధరాత్రి ఒంటరి మహిళ చెరుకూరి సుబ్బాయమ్మ(57) హత్య చేసిన నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 3లక్షలు విలువచేసే 30 గ్రాముల బంగారు ఆభరణాలను, సెల్‌ఫోన్, రూ.960, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హజరత్తయ్య ఆ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు మేరకు..
టంగుటూరు బుచ్చిరాజుపాలెం కాలనీకి చెందిన నత్తల మమత, మఽధుమాల మాధురిలు అప్పు చేసి కుమార్తెల వివాహాలు చేశారు. ఆ పెళ్లిళ్ల తాలుకా అప్పు తీర్చడానికి సుమారు 8 ఏళ్లకిందట నుంచి సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సుబ్బరామిరెడ్డి కాలనీలో నివాసం ఉంటూ పనులు చేసుకుంటుటున్నారు. వీరికి చేపల మార్కెట్ ఎదుట బంకు పెట్టుకొని జీవనం సాగిస్తూ వడ్డీ వ్యాపారం చేసే సుబ్బాయమ్మతో పరిచయం ఏర్పడింది. ఆమె నుంచి మమత రూ.80వేలు, మాఽధురి రూ.50వేలు అప్పు తీసుకున్నారు. మమత రూ.850, మాధురి రూ. 600లు ప్రతిరోజూ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆడబ్బును వసూలు చేయడానికి ఇరువురు మహిళల వద్దకు సుబ్బాయమ్మ విటులను పంపించి వ్యభిచారం చేయించి నగదు వసూలు చేసుకుంటుంది. ఈ క్రమంలో హత్యకు వారం రోజుల ముందు మమత, మాధవిలకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సుబ్బాయమ్మకు రోజువారీ వడ్డీ నగదు చెల్లించలేకపోయారు. దీంతో ఆమె ఇరువురు మహిళలను నీచంగా మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేకపోయిన వ్యభిచారం చేసి తనకు నగదును చెల్లించాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆమెపై మమత, ఆమె కొడుకు ముణికంఠ, మాధురి కోపం పెంచుకున్నారు. మమత యూటూబ్‌లో సీఐడీ సీరియల్స్ చూసి హత్య ఏలా చేయాలో పఽథకం రూపొందించింది.
పాయసంలో నిద్రమాత్రలు కలిపి...
ఇదిలా ఉండగా, ఈనెల 23వ తేదీ సుబ్బాయమ్మ మమతకు ఫోన్‌చేసి తనకు వేడిచేసిందని పాయసం తీసుకొని రమ్మని చెప్తుంది. అదే అదునుగా భావించిన మమత, మాధురి పాయసం తయారు చేస్తారు. అందులో మాధురి వాడే నిద్రమాత్రలను ఎక్కువ మోతాదులో కలుపుతారు. అనంతరం పాయసం సుబ్బాయమ్మ ఇంటికి తీసుకెళ్లి ఆమె చేత తాపించారు. ఆ తరువాత ఆమెతో ఇరువురు తమ చెల్లించాల్సిన నగదుపై గొడవపడతారు. ఈక్రమంలో మత్తులోకి జారుకుంటున్న సుబ్బాయమ్మను మంచంపైకి నెట్టేస్తారు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్న సమయంలో మమత తన కుమారుడు మణికంఠకు ఫోన్‌చేసి పిలిపిస్తోంది. మమత, మాధురిలు ఆమెను కదలకుండా పట్టుకోవడంతో సుబ్బాయమ్మ మోహంపై మణికంఠ దిండుతో గట్టిగా ఊపిరి ఆడకుండా నొక్కి హత్యచేశారు. అనంతరం ఆమె ఒంటిపైన బంగారు ఆభరణాలను, బీరువాలోని నదును, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ను అపహరించుకుని వెళ్లారు.
తక్కువ సమయంలోనే నిందితుల పట్టివేత
కేసు దర్యాప్తులో భాగంగా స్థానికులను విచారించగా హత్య జరిగిన రాత్రి మమత, మాధురిలు సుబ్బాయమ్మతో గొడవపడినట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. వారిని అనుమానితులుగా భావించి అన్నీ కోణాల్లో దర్యాప్తు చేయగా మమత ఆమె కుమారుడు మణికంఠ, మాధురి ముగ్గురు కలిసి సుబ్బాయమ్మను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వస్తారు. నిందితులు ముగ్గురిని గురువారం టంగుటూరు వెళ్లే మార్గంలో జరుగుమల్లి అడ్డరోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సీఐ హజరత్తయ్య, ఎస్సై బి. మహేంద్ర, ఏఎస్సై మొహీద్దీన్, హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతిస్వామి, శ్రీను, పీసీలు రమణ, విజయ్, మౌలాళి, అనూష, శివకుమారిలను ఎస్పీ దామోదర్ అభినందించారు.