ఇసుక రవాణాపై పోలీసు ఆంక్షలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:32 PM
‘‘ఇసుక రవాణాపై పోలీసుల ఆంక్షలు అధికమయ్యాయి. ఒంగోలు పరిసరాల్లో విక్రయించాలంటే ఇసుక స్టాక్‌యార్డులో కాటా వేయాల్సిందే. ఇతర ప్రాంతాలలో కాటా వేసిన లారీల వెంట ప్రైవేటు సైన్యం పడి వారిని అనుసరించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.
ఓవర్ లోడ్ కేసుల నమోదు
గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసిన ట్రాక్టర్ యజమానులు
స్టాక్ యార్డుకు నోటీసు ఇచ్చిన మైనింగ్ అధికార్లు
ఒంగోలు కలెక్టరేట్/క్రైం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి) : ‘‘ఇసుక రవాణాపై పోలీసుల ఆంక్షలు అధికమయ్యాయి. ఒంగోలు పరిసరాల్లో విక్రయించాలంటే ఇసుక స్టాక్‌యార్డులో కాటా వేయాల్సిందే. ఇతర ప్రాంతాలలో కాటా వేసిన లారీల వెంట ప్రైవేటు సైన్యం పడి వారిని అనుసరించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అర్ధరాత్రి అయినా పోలీసులు రంగంలోకి దిగి అదనపులోడు అంటూ కేసులు నమోదు చేస్తున్నారని’’ సోమవారం ఒంగోలు కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో ఉండే ట్రాక్టర్ల యజమానులు కలెక్టర్ రాజాబాబును కలసి వినతిపత్రం ఇచ్చారు. ఇసుక రవాణాకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని ముఖ్యమంత్రి ఆదేశించినా ఒంగోలులో ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని పలువురు లారీ యజమానులు, ట్రాక్టర్ల యజమానులు వాపోతున్నారు.
స్టాక్ యార్డు కాటా వేయకపోతే కేసు
స్థానిక ఇసుక స్టాక్‌యార్డు నుంచి కాటా స్లిప్ లేకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని లారీ యజమానులు వాపోతున్నారు. నెల్లూరు నుంచి ఇసుక రవాణా చేస్తున్న లారీలు నేరుగా వినియోగదారుని వద్దకు వెళ్లాలంటే కాటా వేసుకొని వెళతారు. స్టాక్‌యార్డులో కాటా స్లిప్ లేకుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. స్టాక్ యార్డులో కాటా వేసుకుంటే టన్నుకు రూ.150 చొప్పున చెల్లించాలని లారీ యజమానులు చెబుతున్నారు. బయిట మార్కెట్‌లో గతంలో టన్నుకు రూ.500కు విక్రయిస్తుంటే ప్రస్తుతం రూ.800 నుంచి రూ.850వరకు చేరింది. నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చే వరకు ఎవరూ లారీలను ఆపడంలేదని ఒంగోలులో పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.
ఇసుక స్టాక్ యార్డు యజమాన్యానికి నోటీసు ఇచ్చిన మైనింగ్ అధికారులు
ప్రైవేటు సైన్యం లారీల వెంట పడి టన్నుకు రూ.150 వసూలు చేస్తున్నారని ప్రచురితమైన కథనాలపై స్పందించిన మైనింగ్ శాఖ డీడీ రాజశేఖర్ ఒంగోలు ఇసుక యార్డు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వసూళ్లు ఆగలేదని పలువురు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. అదే క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఓ లారీని నిలిపివేసిన పోలీసులు ఓవర్ లోడ్ ఉన్నట్లు కేసు నమోదు చేశారు. ఇలానిత్యం ఇసుక లారీలపై ఓవర్‌లోడ్ కేసులు నమోదు చేస్తున్నారు.
ఇసుక ఉచితం అని చెప్పిన ప్రభుత్వం, కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
ప్రభుత్వం ట్రాక్టర్లతో ఇసుక ఉచితంగా తరలించవచ్చు అని చెప్పింది. ఒంగోలు తాలుకా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని సోమవారం కలెక్టర్ రాజాబాబుకు వారాహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఇసుక ట్రాక్టర్‌ను ఎక్కడ ఆపడం లేదని తాలుకా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని నాయకులు సురే్‌షబాబు, రాజేష్, వెంకటేశ్వర్లు, ఉప్ప రవితేజ, శ్రీనివాసులుతో పాటు పలువురు ట్రాక్టర్స్ ఓనర్లు ఉన్నారు.