Share News

అరుణ దందాలపై పోలీసుల ఆరా

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:38 AM

లేడీ డాన్‌గా నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన అరుణ చేసిన అక్రమాలపై నెల్లూరు పోలీసులతోపాటు మన జిల్లా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ పేరుతో ఎన్‌జీవో నడిపిన అరుణ పోలీసు స్టేషన్లలో చేసిన దందాలు అన్నీఇన్నీ కావని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తుండగా పోలీసులు వరుసగా సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్నారు.

అరుణ దందాలపై పోలీసుల ఆరా

వీరయ్యచౌదరి హత్య కేసులో నిందితులతో సంబంధం

పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుల పరిశీలన

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి) : లేడీ డాన్‌గా నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన అరుణ చేసిన అక్రమాలపై నెల్లూరు పోలీసులతోపాటు మన జిల్లా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ పేరుతో ఎన్‌జీవో నడిపిన అరుణ పోలీసు స్టేషన్లలో చేసిన దందాలు అన్నీఇన్నీ కావని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తుండగా పోలీసులు వరుసగా సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న అరుణను ఇటీవల నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు తమ కస్టడీకి తీసుకొని మూడు రోజులు విచారించారు. ఆ సమయం లో ప్రకాశం జిల్లాలో అరుణ నేర సామ్రాజ్యం గురించి కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన నరహంతక ముఠా పాల్గొంది. ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో అత్యంత కసిగా వీరయ్యచౌదరిని కత్తితో పొడిచినట్లు పోలీసులు చెబుతున్న వంశీకి అరుణ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. శ్రీకాంత్‌ పెరోల్‌ కోసం ప్రయత్నించిన అరుణకు అనేక మంది రౌడీషీటర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. శ్రీకాంత్‌ ముఖ్య అనుచరుడు జగదీష్‌తో వంశీకి సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు జగదీష్‌ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వంశీకి కూడా నేరచరిత్ర ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. తాజాగా అరుణ గ్యాంగ్‌తో వీరయ్యచౌదరి కేసు హంతకులకు ఉన్న సంబంధాలపై జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా అరుణ జిల్లాలో ఎక్కడైనా దందాలకు పాల్పడిందా? అనే అంశంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:38 AM