పొదిలి ఏఎంసీ పీఠంపై మైనారిటీ నేత ఇమాంసాహెబ్
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:34 PM
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని తొలిసారిగా ఓ మైనారిటీ నేత దక్కించుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేసిన సయ్యద్ ఇమాంసాహెబ్ పొదిలి పట్టణ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.
తొలిసారిగా అవకాశమిచ్చిన టీడీపీ
పొదిలి, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని తొలిసారిగా ఓ మైనారిటీ నేత దక్కించుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేసిన సయ్యద్ ఇమాంసాహెబ్ పొదిలి పట్టణ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. దివంగత మాజీ మంత్రి కాటూరి నారాయణస్వామి, మాజీ ఎంపీపీ కఠారి రాజుల అనుచరుడిగా పేరుతెచ్చుకున్నారు. పట్టణంలో గ్రామీణ వైద్యునిగా పేదవర్గాలలో గుర్తింపు పొందారు. ఎంపీటీసి సభ్యునిగా రాజకీయ అరంగేట్రం చేసి ఆ ప్రాదేశి నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మైనారిటీ నేతగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. పార్టీ అధిష్టానం నిర్వహించిన అంతర్గత సర్వేలో సైతం టీడీపీ శ్రేణుల నుంచి ఇమాంసాహెబ్‌కు మద్దతు లభించింది. నారాయణరెడ్డి ఆశీస్సులతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు.
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ 1976లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9మంది చైర్మన్‌లుగా వ్యవహరించారు. తొలి చైర్మన్‌గా పొదిలి పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన కొంవీటి సత్యనారాయణ, గాదంశెట్టి వెంకట నరసింహారావులు పనిచేయగా, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎన్ వెంకటరమణారెడ్డి, పాతకోట్టు క్రిష్ణారెడ్డి, గుజ్జుల రమణారెడ్డిలు, కమ్మ సామాజిక వర్గం నుంచి యర్రమోతు శ్రీనివాసులు, చప్పిడి రామలింగయ్యలు చైర్మన్లుగా పనిచేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి గుర్రపుశాల కోటేశ్వరి తొలి మహిళా అధ్యక్షురాలిగా రెండు పర్యాయాలు పనిచేశారు. నూతన చైర్మన్‌గా ఎంపికై సయ్యద్ ఇమాంసాహెబ్ లాంఛనంగా శుక్రవారం భాధ్యతలు చేపట్టారు. ఆయనను కార్యదర్శి రవీంద్రారెడ్డి, డైరెక్టర్లు రోళ్ల శ్రీనివాసులు, సోమిశెట్టి శ్రీదేవిలు సత్కరించారు.