Share News

సాగర్‌ కాలువలకు పుష్కలంగా నీరు

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:26 PM

సాగర్‌ కాలువలకు పుష్కలంగా నీరు సరఫరా అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం, నాగానర్జునసాగర్‌ జలాశయాలు పూర్తిగా నిండిన విషయం విదితమే. ముందుగా సాగుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం సాగర్‌ కాలువలకు నీరు విడుదల చేసింది. ప్రస్తుతం కుడి కాలువకు డ్యామ్‌ నుంచి 8,604 క్యూసెక్కులు విడుదల చేయగా బుగ్గవాగుకు చేరుతోంది.

సాగర్‌ కాలువలకు పుష్కలంగా నీరు
ఒంగోలు బ్రాంచ్‌ కాలువలో పుష్కలంగా ప్రవహిస్తున్న సాగర్‌ జలాలు

వరినాట్లకు సిద్ధమవుతున్న రైతులు

దర్శి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ కాలువలకు పుష్కలంగా నీరు సరఫరా అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం, నాగానర్జునసాగర్‌ జలాశయాలు పూర్తిగా నిండిన విషయం విదితమే. ముందుగా సాగుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం సాగర్‌ కాలువలకు నీరు విడుదల చేసింది. ప్రస్తుతం కుడి కాలువకు డ్యామ్‌ నుంచి 8,604 క్యూసెక్కులు విడుదల చేయగా బుగ్గవాగుకు చేరుతోంది. అక్కడి నుంచి సాగర్‌ ప్రధాన కాలువకు 7,260 క్యూసెక్కులు వస్తోంది. అందులో గుంటూరు బ్రాంచ్‌ కాలువకు 1,300 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్‌ కాలువకు 3,305 క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ (ప్రకాశం బార్డర్‌) అయిన 85/3 మైలుకు 2,406 క్యూసెక్కులు సరఫరా అవుతోంది. ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు వచ్చే సరికి 1,284 క్యూసెక్కుల నీరు పంపిణీ అవుతోంది. దీంతో ఆయకట్టు భూముల్లో వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. బోర్ల వసతి ఉన్న వారు గతంలోనే నార్లు పోసి ఉండటంతో ప్రస్తుతం నాట్లు వేస్తున్నారు. మిగిలిన ఆయకట్టు రైతులు ఇప్పుడు నార్లు పోస్తున్నారు. ఈ ఏడాది సాగర్‌ జలాలు అనుకున్న సమయానికంటే ముందుగానే విడుదలవ్వడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - Aug 03 , 2025 | 11:26 PM