Share News

ఆక్రమణల తొలగింపుపై మీనమేషాలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:55 PM

చారిత్రాత్మక కంభం చెరువు ఇరిగేషన్‌ పంట కాలువలపై ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తతన్నారు. పంట కాలువలను ఆక్రమించి నిర్మించుకున్న అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు త్వరలోనే తొలగిస్తామని చెప్పి నేటికీ ఆరు నెలలైనా గడిచినా పట్టించుకోకపోవడంపై స్థానిక రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఆక్రమణల తొలగింపుపై మీనమేషాలు
కంభం ఇరిగేషన్‌ ప్రధాన పంట కాలువను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలు

ఇరిగేషన్‌ పంట కాలువలపై అక్రమ నిర్మాణాలు

6నెలలు గడిచినా చర్యలు శూన్యం

అధికారుల సమన్వయ లోపం.. రైతులకు శాపం

కంభం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : చారిత్రాత్మక కంభం చెరువు ఇరిగేషన్‌ పంట కాలువలపై ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తతన్నారు. పంట కాలువలను ఆక్రమించి నిర్మించుకున్న అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు త్వరలోనే తొలగిస్తామని చెప్పి నేటికీ ఆరు నెలలైనా గడిచినా పట్టించుకోకపోవడంపై స్థానిక రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘పంట కాలువలపై అక్రమ కట్టడాలు’ అనే శీర్షికన మార్చి 18వ తేదీన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రత్యేక కథనానికి స్పందించిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు కంభం, కందులాపురం పంచాయతీల పరిధిలో పంట కాలువలను పరిశీలించి అక్రమ కట్టడాలను గుర్తించారు. తహసీల్దార్‌ కిరణ్‌ కందులాపురం పంచాయతీ కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ మ్యాప్‌ ద్వారా పరిశీలించి మార్కింగ్‌ ఇచ్చారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా మార్కింగ్‌ ఇచ్చిన వరకు తొలగించుకోవాలన్నారు. లేని పక్షంలో తామే ఎక్స్‌వేటర్‌ సహాయంతో తొలగిస్తామని హెచ్చరించారు. ఆ తరువాత ఇరిగేషన్‌ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఆక్రమణల తొలగింపుపై పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై తహసీల్దార్‌ కిరణ్‌ను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా కందులాపురం పంచాయతీ వరకు తమ వద్ద మ్యాపింగ్‌ ఉందని దానితో అక్రమ కట్టడాలు గుర్తించి మ్యాపింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. కానీ కంభం పంచాయితీకి సంబంధించి ఇరిగేషన్‌ పంటకాలువలపై అక్రమ కట్టడాలను గుర్తించాలంటే కంభం ఇరిగేషన్‌ కార్యాలయంలోని మ్యాప్‌ కావాలన్నారు. కానీ ఇరిగేషన్‌ అధికారులు తమ దగ్గర మ్యాప్‌ లేదని చెప్తున్నారని తహసీల్దార్‌ తెలిపారు. ఈ విషయమై ఇరిగేషన్‌ ఏఈ శ్రీనివాస్‌ నాయక్‌ను ప్రశ్నించగా కంభం, కందులాపురం పంచాయతీల పరిధిలో అక్రమ కట్టడాలను గుర్తించాలంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలించాలన్నారు. వారి వద్ద మ్యాపు లేదని చెబుతున్నారని, రెవెన్యూ అధికారుల వద్ద మ్యాప్‌ లేకుంటే మా దగ్గర ఎలా వస్తుందని తెలిపారు.

రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల మధ్య సమన్వయ లోపం

ఇరిగేషన్‌ పంట కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించాలంటే రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు చర్చించుకుని మ్యాపులను పరిశీలించాలని కానీ ఇరు శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం మా రైతులకు శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ఇరువైపులా అక్రమ కట్టడాల వలన కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం సాధ్యం కావడం లేదని ఇప్పటికైనా ఇరు శాఖల అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 10:55 PM