Share News

వీధి కుక్కలతో ప్రజలు బెంబేలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:44 AM

వీధి శునకాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎటు నుంచి శునకాలు మూకుమ్మడిగా దాడులకు పాల్పడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వీధి కుక్కలతో ప్రజలు బెంబేలు

పర్చూరు/కారంచేడు, ఆగస్టు 19 (ఆంఽధ్రజ్యోతి) : వీధి శునకాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎటు నుంచి శునకాలు మూకుమ్మడిగా దాడులకు పాల్పడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పర్చూరు, కారంచేడు మండలాల పరిధిలో ఏ గ్రామంలో చూసిన వీధికుక్కలు గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ప్రధాన వీధులు, రహదారుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఆయా మార్గాలలో రాకపోకలు సాగించే వారిపై మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్నాయి. రాత్రి సమయాల్లో రోడ్లపైకి రావాలంటే ప్రజలు వాహన దారులు భయపడుతున్నారు. ఎటు నుంచి వీధి శునకం తనపై దాడిచేస్తుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మరీ రాకపోకలు సాగిస్తునారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఆయా మండలాల పరిధిలో గడిచిన నెల రోజుల్లో 40 మందికి పైగా ప్రజలు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది పర్చూరుకు చెందిన ఓ వ్యక్తి వీధి శునకం దాడిలో గాయపడి రేబీస్‌ వ్యాధితో మృతి చెందిన ఘటన కూడా ఉంది. దీంతో వీధి శునకాల దాడిలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ప్రజలు భయపడుతున్నారు.

ఇరువురు చిన్నారులపై దాడి

పర్చూరు పోలీసు స్టేషన్‌వీధిలో పాఠశాలకు వెళుతున్న ఇద్దరు చిన్నారుపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చుట్టుపక్కలవారు గుర్తించి కేకలు వేసి రక్షించడంతో పెనుప్రమాదం తప్పింది. శునకాల దాడిలో గాయపడిన చిన్నారులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. ఇలాంటి ఘటనలతో చిన్నారులను ఒంటరిగా బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

వాహనదారులపై వెంటాడి మరీ దాడులు

పర్చూరు - చీరాల ప్రధాన రోడ్డులో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ రహదారిలో వీధి శునకాలు స్వైర వివాహారం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంటాడి మరీ దాడులకు పాల్పడు తున్నాయి. శునకాల దాడి నుంచి రక్షించుకునే క్రమం లో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇటీవల పర్చూరుకు చెందిన టైలర్‌ చీరాల నుండి పర్చూరుకు వస్తున్న తరుణంలో స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో శునకాలు వెంటపడ డంతో తప్పించుకోపోయి వాహనం అదుపు తప్పి ప్రాణాలు కోల్పో యారు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.

పిచ్చికుక్కలతో పెను ప్రమాదం

వీధుల్లో విచ్చలవిడిగా కుక్కలు పెరిగి పోవడం ఒక సమస్య అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పిచ్చికుక్కలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాల్లో పిచ్చిపట్టిన కుక్కలు సంచరిస్తున్నాయని ఎప్పుడు ఎలాంటి ప్రాణహాని జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి శునకాలు పెరిగిపోయి అవికాస్త వ్యాధుల బారిన పడడంతో ఇలాంటి ప్రమాద కరమైన దుస్థితి నెలకొంది ఆయా గ్రామాల వాసులు వాపోతున్నారు.

Updated Date - Aug 20 , 2025 | 12:47 AM