Share News

పునరావాసానికీ బిల్లుల పెండింగ్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 10:17 PM

వెలిగొండ నిర్వాసిత పునరావాస కాలనీలకు బకాయిలు పెండింగ్‌ ఉండటంతో పనులు నిలిచిపోయాయి. నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఏళ్లతరబడి కాలయాపన చేస్తున్న ప్రభుత్వాలు వారి కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీల్లో మౌలికవసతులు కల్పించటంలో కూడా నిర్లక్ష్యం చూపుతోంది.

పునరావాసానికీ బిల్లుల పెండింగ్‌
తోకపల్లి పునరావాసకాలనీ ముఖద్వారం

వెలిగొండ నిర్వాసితుల కాలనీలకు నిధుల సమస్య

గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి కోట్లలో బకాయిలు

త్రిపురాంతకం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ నిర్వాసిత పునరావాస కాలనీలకు బకాయిలు పెండింగ్‌ ఉండటంతో పనులు నిలిచిపోయాయి. నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఏళ్లతరబడి కాలయాపన చేస్తున్న ప్రభుత్వాలు వారి కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీల్లో మౌలికవసతులు కల్పించటంలో కూడా నిర్లక్ష్యం చూపుతోంది. గత ప్రభుత్వం ఈ పునరావాసకాలనీలను పూర్తిగా వదిలేసింది. ఈనెల 7న పునరావాసం-పరిహాసం అనే శీర్షికతో ఆంఽధ్రజ్యోతి కథనం ప్రచురించింది. దీనిపై జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు అబుతలీమ్‌ వివరణ ఇచ్చారు. అధికారికంగా ఆయన ఇచ్చిన వివరాలను బట్టి పునరావాసానికి కూడా గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా నిలిచిపోయాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

నాలుగుచోట్ల పునరావాసకాలనీల్లో చేసిన పనులకు గాను 14 కోట్ల 74లక్షల రూపాయలు బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.

ఇడుపూరు -1 పునరావాస కాలనీలో ఆలయాల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉండగా బిల్లులు ఇవ్వని కారణంగా కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు.

ఇడుపూరు-2 కాలనీలో సీతాలమ్మ, పోలేరమ్మ, వీరభద్రస్వామి తదితర ఆలయాల నిర్మాణం కూడా బిల్లులు రావాల్సి ఉండటంతో నిలిపివేశారు.

దేవరాజుగట్టు పునరావాస కాలనీలో గతంలో ఉన్న కాంట్రాక్టరును తొలగించి వేరే కాంట్రాక్టరుతో పనులు చేపట్టారు.

తోకపల్లి కాలనీలో స్మశానవాటిక నిర్మాణం, తపాలభవనం, వైద్యశాల, పశువైద్యశాల భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కాంట్రాక్టరుకు 2 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోవటంతో పనులు ఆపివేశారు.

మొత్తంమీద గోగులదిన్నె కాలనీ కాంట్రాక్టరుకు ఎక్కువ మొత్తంలో బిల్లులు నిలిచిపోయాయి. ఇక్కడ 9 కోట్ల 10లక్షల రూపాయలు కాంట్రాక్టరుకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

పునరావాస కాలనీల్లో ప్రస్తుతం ఎటువంటి పనుల జరగటం లేదని అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించిన తరువాత మళ్లీ పనులు చేపట్టే అవకాశాలున్నాయి.

కాంట్రాక్టర్లకు పెండింగ్‌ ఉన్న బిల్లులు:

పునరావాసకాలనీ బకాయి(లక్షల్లో)

ఇడుపూరు- 1 రూ. 16.60

ఇడుపూరు - 2 రూ. 28.21

దేవరాజుగట్టు రూ. 315.00

తోకపల్లి రూ. 205.00

గోగులదిన్నె రూ. 910.00

Updated Date - Jul 28 , 2025 | 10:17 PM