తూర్పున శనగ.. పశ్చిమాన సజ్జ, మొక్కజొన్న
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:15 AM
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ శనివారంతో ముగిసింది. రైతు సేవా కేంద్రం యూనిట్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 516 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 2.78 లక్షల కుటుంబాలను ఆయా శాఖల సిబ్బంది కలిశారు.
ధరలు కల్పించి కొనుగోలు చేయాలంటున్న రైతులు
అన్నిచోట్లా వ్యవసాయ యంత్రాలకు డిమాండ్
ముగిసిన ‘రైతన్నా మీకోసం’
2.78 లక్షల కుటుంబాలను కలిసిన సిబ్బంది
చివరిరోజు పలుచోట్ల ముఖ్యప్రజాప్రతినిధులు హాజరు
ఆర్‌ఎస్‌కే స్థాయిలో ప్రణాళికలు
ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ శనివారంతో ముగిసింది. రైతు సేవా కేంద్రం యూనిట్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 516 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 2.78 లక్షల కుటుంబాలను ఆయా శాఖల సిబ్బంది కలిశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన, మేలైన యాజమాన్య పద్ధతులు, సాంకేతికత వినియోగం తదితర ఐదు అంశాలను వివరించడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనెల 24 నుంచి 29వతేదీ వరకు వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌కే యూనిట్‌గా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ఈ అంశాలను వివరించడంతోపాటు వారి అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలోని 516 రైతు సేవా కేంద్రాలలో ఈనెల 24న వ్యవసాయశాఖ అధికారులు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) శ్రీనివాసరావు మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా అన్ని ఆర్‌ఎస్‌కేల్లోనూ స్థానిక అధికారులు, సిబ్బంది సగటున రోజుకు 90 కుటుంబాలను కలిసేలా ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. పలువురు కీలక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చివరిరోజైన శనివారం పీసీపల్లి మండలం నేరేడుపల్లిలో జరిగిన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొనగా రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కొమరోలు మండలం రాజుపాలెంలో పాల్గొనగా దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ముండ్లమూరు మండలం శింగన్నపాలెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు కూడా వివిధ ఆర్‌ఎస్‌కేలలో పాల్గొనగా డీఏవో శ్రీనివాసరావు ఎస్‌ఎన్‌పాడు మండలం మంగమూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గిట్టుబాటు ధరలే ప్రధానం
జిల్లాలోని మొత్తం 516 ఆర్‌ఎస్‌కేల పరిధిలోని 2.78లక్షల రైతు కుటుంబాలను ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది కలిసినట్లు డీఏవో శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా రైతుల వద్దకు సిబ్బంది వెళ్లిన సమయంలో ప్రభుత్వ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరించడంతోపాటు ప్రస్తుతం రైతులు ఏమి కోరుకుంటున్నారనే దానిపై కూడా తెలుసుకున్నారు. ఆ సందర్భంగా అనేక గ్రామాల్లో రైతులు తాము పండించిన శనగ, సజ్జ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు లభించని వైనాన్ని వారి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ప్రధానంగా తూర్పు ప్రాంతంలోని రైతులు శనగల పరిస్థితిని వివరిస్తూ ధరలు సరిలేక కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేస్తే మళ్లీ సాగు సీజన్ వచ్చినా వాటిని కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్న ధరలు కొనుగోలు అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు. అదేసమయంలో అన్నిప్రాంతాల్లో డ్రోన్లు, ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కార్యక్రమం ముగియగా తమ దృష్టికి వచ్చిన, గుర్తించిన అంశాలను విశ్లేషించి ఆర్‌ఎస్‌కే స్థాయిలో ప్రస్తుత రబీ, అలాగే వచ్చే ఏడాది ఖరీఫ్ రబీ సీజన్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నట్లు డీఏవో శ్రీనివాసరావు తెలిపారు. వచ్చేనెల 3న ఆర్‌ఎస్‌కేలలో రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి చర్చిస్తామన్నారు. అలాగే రైతులు తమ దృష్టికి తెచ్చిన పట ఉత్పత్తుల ధరలు, యంత్ర పరికరాలు ఇతర అంశాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.