Share News

ప్రగతి ‘దారులు’

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:13 AM

ఒంగోలు నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రధానంగా రోడ్ల విస్తరణ ప్రారంభమైంది. ఇప్పటికే పలు రహదారుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్నింటికి రంగం సిద్ధమైంది. ఈసారి ప్రభుత్వపరంగా నిధుల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో తొలుత కార్పొరేషన్‌ పరిధిలో అందుబాటులో ఉన్న నిధులతో కీలకమైన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ప్రారంభించారు.

ప్రగతి ‘దారులు’
అభివృద్ధి, విస్తరణకు ప్రతిపాదించిన ఒంగోలులోని శ్రీనివాసథియేటర్‌ రోడ్డు

ఒంగోలులో కీలక రోడ్ల విస్తరణ

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

80 అడుగులతో ట్రంకురోడ్డు, 60 అడుగులుగా కొత్తపట్నం రోడ్డు

మంగమూరు రోడ్డు 80 నుంచి 100 అడుగులు

అన్నింటికీ మధ్యలో డివైడర్‌ ఏర్పాటు

త్రోవగుంట నుంచి శ్రీనివాస ఽథియేటర్‌ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి

ఎస్‌ఎస్‌ ట్యాంకు-1 వద్ద ఫుడ్‌ కోర్టు

ఇప్పటికే కార్యాచరణ ప్రారంభం

నిధుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు

ఒంగోలు నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రధానంగా రోడ్ల విస్తరణ ప్రారంభమైంది. ఇప్పటికే పలు రహదారుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్నింటికి రంగం సిద్ధమైంది. ఈసారి ప్రభుత్వపరంగా నిధుల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో తొలుత కార్పొరేషన్‌ పరిధిలో అందుబాటులో ఉన్న నిధులతో కీలకమైన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ప్రారంభించారు. అలా ప్రస్తుతం సీవీఎన్‌ రీడింగ్‌ రూం, లాయర్‌పేట ప్రకాశం పంతులు విగ్రహం కూడలి, కొత్తపట్నం బస్టాండు సెంటర్‌ వంటి వాటితోపాటు పలు ఇతర రోడ్లు, కూడళ్ల వద్ద విస్తరణ చేసి సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. మరికొన్ని ప్రధాన కాలువలను పెద్దవిగా చేసి డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరుస్తున్నారు. ప్రధాన రోడ్ల మధ్య ఉన్న డివైడర్లపై పచ్చదనం, ఇతర ఆహ్లాదకర వాతావరణ చర్యలు చేపట్టారు. ఇప్పుడు మరికొన్ని రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించారు.

ఒంగోలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌, నగర విస్తరణ, జనం రద్దీ నేపథ్యంలో ఒంగోలు నగరంలోని పలు రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ దృష్టి సారించారు. అవకాశం ఉన్న మేర ప్రజలకు ఆహ్లాద వాతావరణంతోపాటు నగర సుందరీకరణ, పచ్చదనం పెంపు తదితరాలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రధానంగా నగరంలో తీవ్ర రద్దీ పరిస్థితి ఉంటూ వన్‌వే పెట్టినా రాకపోకలు సజావుగా సాగే అవకాశం లేని ట్రంకురోడ్డు, కొత్తపట్నం రోడ్డు విస్తరణపై దృష్టి సారించారు. ట్రంకురోడ్డు ప్రస్తుతం 40 అడుగులు ఉండగా దానిని కనీసం 80 అడుగుల వెడల్పు లక్ష్యంగా చర్యలు ప్రారంభించారు. తొలుత ఒకేసారి వంద అడుగులకు విస్తరణ చేయాలని భావించినా వ్యాపారుల నుంచి వచ్చిన వినతులు, వారి సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకొని 80 అడుగులకే పరిమితం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దాని వల్ల దుకాణాలు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా పాత మార్కెట్‌ వద్ద పీపీపీ పద్ధతిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి షాపుల కేటాయింపు లేదా టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి ఎక్కువ మంది వ్యాపారులు అంగీకరించినట్లు సమాచారం. కొందరు కోర్టును ఆశ్రయించడంతో అలాంటి వారి విషయంలో చట్టప్రకారం వ్యవహరించే యోచనలో ఎమ్మెల్యే, మునిసి పల్‌ పాలకవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వన్‌వే అయిన కొత్తపట్నం బస్టాండ్‌ రోడ్డును 60 అడుగుల మేర విస్తరించే యోచన చేస్తున్నారు. వివిధ వర్గాల వారితో సంప్రదింపులు, కార్పొరేషన్‌ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కొలిక్కి వచ్చాయి. మరోవైపు నగరంలోని మంగమూరు రోడ్డు, శ్రీనివాస ఽథియేటర్‌ రోడ్డుల భారీ విస్తరణ, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లాయర్‌పేట ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుంచి ప్రారంభమయ్యే మంగమూరు రోడ్డు బైసాస్‌కు ఇరువైపులా దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర పూర్తిగా రద్దీగా మారింది. అలా ఓపీఎస్‌ వరకు భారీ నిర్మాణాలు ఉన్నాయి. అక్కడి నుంచి పశ్చిమం వైపు మరో మూడు కి.మీ మేర కూడా నివాసిత ప్రాంతంగా అభివృద్ధి చెందింది. పెద్దసంఖ్యలో నివాసాలు పెరగడం, ప్రత్యేకించి అపార్ట్‌మెంట్లు భారీగా ఉండటంతో స్కూళ్లు, కాలేజీలు పెరిగిపోయాయి. ఎగువన కొండపి ప్రాంతం నుంచి కూడా ఈ రోడ్డుపై రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగమూరు రోడ్డు అభివృద్ధి అవసరం అధికంగా ఉంది. దీంతో ఈ రోడ్డుపై దృష్టిసారించిన ఎమ్మెల్యే జనార్దన్‌ ఇప్పటికే రోడ్డు పక్కన భారీ నిర్మాణాలు ఉన్న ఓపీఎస్‌ వరకు 80 అడుగులుగా అక్కడి నుంచి పైన 100 అడుగుల రోడ్డు విస్తరించడంతోపాటు మధ్యలో డివైడర్లు లైటింగ్‌ ఇరువైపులా కాలువల నిర్మాణం ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.24కోట్లు అవసరమని అంచనా.

కీలక ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి

మరో ప్రధానమైనదిగా ఉన్న నగరంలోని పాత మార్కెట్‌ ఎదురు సెయింట్‌ థెరిస్సా స్కూలు నుంచి శ్రీనివాస థియేటర్‌ మీదుగా నగరంలోని పలు పేదల కాలనీలను కలుపుతూ ముక్తినూతలపాడు వెళ్లే రోడ్డును కూడా 100 అడుగుల వెడల్పు, అభివృద్ధికి ప్రతిపాదించారు. ముక్తినూతలపాడు నుంచి త్రోవగుంట ఎన్టీఆర్‌ విగ్రహం వరకూ దీన్ని పొడిగించనున్నారు. తద్వారా ఒంగోలు రూరల్‌ మండలలోని కరవది వైపు గ్రామాల నుంచి వచ్చేవారు బైసాస్‌కు వెళ్లే పనిలేకుండా నగరంలోకి నేరుగా వచ్చేందుకు వీలు కూడా కలుగుతుంది. ఆ రోడ్డులో భాగంగా ముదిగొండి వాగుపై కల్వర్టు, పోతురాజు కాలువపై కొత్త వంతెన కూడా నిర్మించనున్నారు. సుమారు రూ.24 కోట్లు అవసరంగా అంచనా వేశారు.

ఆహ్లాదం కోసం సరికొత్తగా..

నగరంలో ఆహ్లాదం, పచ్చదనంలో భాగంగా ఐదు వేల మొక్కలు నాటాలని నిర్ణయించి దాని అమలుకు చర్యలు ప్రారంభించారు. ఒకటో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వద్ద భారీ పుడ్‌ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ ట్యాంకు పశ్చిమ, దక్షిణంవైపు దాదాపు రూ.4.5 కోట్ల వ్యయంతో ఆహ్లాదకరంగా పార్కులు, పిల్లలకు క్రీడా స్థలం, జిమ్‌ సెంటర్లతోపాటు వీధి వ్యాపార కేంద్రం (ఫుడ్‌ కోర్టు)గా ప్రత్యేకించి తినే ఆహార పదార్థాల దుకాణాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. తద్వారా నగర ప్రజలు కొన్ని గంటలపాటు అక్కడ ఆహ్లాదకరంగా గడిపేలా దీనిని ప్రతిపాదిస్తున్నారు. ఆయా పనులకు సంబంధించి నిధుల కోసం ఒకవైపు ప్రభుత్వంతో సంప్రదిస్తూనే మరోవైపు కార్పొరేషన్‌లో అందుబాటులో ఉండే నిధులతో దశల వారీగా అన్నింటినీ పూర్తిచేయనున్నట్లు ఎమ్మెల్యే జనార్దన్‌ చెప్పారు.

Updated Date - Oct 04 , 2025 | 01:13 AM