కాలక్షేపం..
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:21 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో 51 విచారణ రెండో రోజైన బుధవారం కూడా తూతూమంత్రంగానే సాగినట్లు సమాచారం. విచారణాధికారైన సహకార శాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్ రెండో రోజు ఉదయాన్నే బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడిపినప్పటికీ విచారణ పెద్దగా సాగలేదని సమాచారం. కీలకమైన రికార్డులను బ్యాంకు అధికారుల నుంచి ఆయన పొందలేకపోయినట్లు తెలుస్తోంది.
రెండో రోజు డీసీసీబీలో విచారణ తీరు ఇదీ
కీలకమైన రికార్డులు ఇంకా తీసుకోని వైనం
సంబంధం లేని ఆడిట్‌పై విచారణాధికారి సమీక్ష
ఒంగోలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో 51 విచారణ రెండో రోజైన బుధవారం కూడా తూతూమంత్రంగానే సాగినట్లు సమాచారం. విచారణాధికారైన సహకార శాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్ రెండో రోజు ఉదయాన్నే బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడిపినప్పటికీ విచారణ పెద్దగా సాగలేదని సమాచారం. కీలకమైన రికార్డులను బ్యాంకు అధికారుల నుంచి ఆయన పొందలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణపై దృష్టి సారించకుండా బుధవారం ఉదయం సహకారశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అందులో తనకు సంబంధం లేని ఆడిట్‌పై సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కాలక్షేప వ్యవహారంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే విచారణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు చూపే ప్రయత్నంలో భాగంగా రుణాలు పొందిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని విచారణాధికారి కోరడం, తదనుగుణంగా కంప్యూటర్లలో ఉండే ఆ వివరాల జాబితాలను బ్యాంకు సిబ్బంది తీసి ఇవ్వడానికే సమయం అంతా సరిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ తరహా విచారణల సమయంలో విచారణాధికారి కోరిన విధంగా బ్యాంకు అధికారులు అన్నిరకాల రికార్డులను అందజేసి ధ్రువీకరణ పొందాలి. ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలు, ప్రాథమికంగా గతంలో త్రిసభ్య కమిటీ చేసిన విచారణలో గుర్తించిన అంశాలను రికార్డులలో పరిశీలించి తప్పులను విచారణాధికారి నిగ్గు తేల్చాలి. అదేసమయంలో విచారణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రారంభ సమయంలోనే ఫిర్యాదులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగులను ప్రస్తుతం వారు పనిచేసే స్థానాల నుంచి పక్కన పెట్టాలి. అలాంటి చర్యలు ఏవీ ఇప్పటివరకు విచారణాధికారి తీసుకోకపోవడం, ఆయన సూచనలకు అనుగుణంగా బ్యాంకు అధికారులు వ్యవహరించడం వంటివి లేవని తెలుస్తోంది.
అంతా మొక్కుబడిగానే..
విచారణాధికారి గౌరీశంకర్ కూడా మొక్కుబడిగా బ్యాంకుకు రావడం మినహా విచారణ సక్రమంగా చేసే యోచనలో లేరన్న చర్చ సహకారశాఖ వర్గాల్లో నడుస్తోంది. అందుకు ఆయన వ్యవహరిస్తున్న తీరును ఉదహరిస్తున్నారు. తొలివిడత విచారణను తూచ్ అనిపించిన ఆయన రెండవ విడత వచ్చినప్పటికీ విచారణపై తగురీతిలో దృష్టి పెట్టలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సహాయకులుగా కమిషనర్ నియమించిన అధికారులను తీసుకరాకపోవడమే కాక రహస్యంగా విచారణ సాగించే ప్రయత్నం, అంతకు మించి బ్యాంకులో అవినీతి, అక్రమాలలో భాగస్వామ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కనుసన్నల్లో మొత్తం ప్రక్రియ సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రెండో విడత విచారణలో రెండో రోజైన బుధవారం ఉదయం బ్యాంకులో విచారణ పక్కనపెట్టి సహకారశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం, అది కూడా తనకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు కాకుండా సొసైటీలు, ఇతర సంస్థల ఆడిట్‌పై సమీక్ష చేయడం వంటివి విచారణ పేరుతో వచ్చి కాలక్షేపం చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.