రాజముద్రతో పాసుపుస్తకం
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:55 AM
గత వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలపై నాటి సీఎం ఫొటో పెట్టుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తంచేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు.
గత వైసీపీ హయాంలో జగన్ చిత్రంతో పంపిణీ
వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం
జిల్లాకు చేరిన 65,038 పుస్తకాలు
ఈనెల 15 నుంచి 31 వరకు రైతులకు అందజేత
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలపై నాటి సీఎం ఫొటో పెట్టుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తంచేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో ప్రజాప్రభుత్వంలో పాత పట్టాదారు పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేయాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వంలో తొలివిడతగా రీసర్వే చేసిన గ్రామాల్లోని రైతులకు కొత్తవి అందజేయనున్నారు.
డివిజన్ కేంద్రాలకు చేరిన పుస్తకాలు
జిల్లాకు తొలి విడతలో పంపిణీ చేసేందుకు ఇప్పటివరకు 65,038 పాసుపుస్తకాలు డివిజన్ కేంద్రాలకు చేరాయి. అక్కడ మండలాల వారీగా విభజన చేసి పంపుతున్నారు. ఈనెల 15వతేదీ నుంచి 31వతేదీ వరకు రైతులకు వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. గ్రామాల వారీగా తహసీల్దార్ల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఆ ప్రకారం గ్రామాల వారీగా రాజముద్రతో ఉన్న పట్టాదారుపుస్తకాలు పంపిణీ చేస్తారు.