Share News

మాయదారి నల్లి

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:33 AM

జిల్లాను నల్లి పురుగు వణికిస్తోంది. అటు మిర్చి, ఇటు ఇతర పంటలపై దాడిచేసి నాశనం చేస్తోంది. మరోవైపు రైతులు, కూలీలను కుడుతూ ప్రాణాంతకం అవుతోంది. దీంతో జనం అల్లాడుతున్నారు. నివారణ మార్గం తెలియక అయోమయంలో ఉన్నారు.

మాయదారి నల్లి

పంటపై, ఒంటిపై దాడి

మిర్చి దెబ్బతినడంతో అల్లాడుతున్న రైతులు

కూలీలను కుడుతుండటంతో వస్తున్న స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి

భయాందోళనలో ప్రజలు

నివారణ మార్గాలు తెలియక ఆందోళన

అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలు

ప్రజలకు స్క్రబ్‌ టైఫస్‌ అనే కొత్తరకం వ్యాధి రావడానికి, పంటలపై దాడిచేసి నష్టాల పాల్జేయడానికి రెండింటికీ కారకం నల్లి! ఇప్పుడు ఎవరినోట విన్నా నల్లి మాటే..! ముఖ్యంగా మిర్చి రైతులు పంటపై సోకిన వైరస్‌ కారకం తామర పురుగు (వాడుక భాషలో నల్లి) ఉధృతి కారణంగా నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అదే నల్లి కుట్టిన కారణంగానే స్క్రబ్‌ టైఫస్‌ సోకుతుందని, దీని బారినపడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మరణించారన్న వార్త ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.

త్రిపురాంతకం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను నల్లి పురుగు వణికిస్తోంది. అటు మిర్చి, ఇటు ఇతర పంటలపై దాడిచేసి నాశనం చేస్తోంది. మరోవైపు రైతులు, కూలీలను కుడుతూ ప్రాణాంతకం అవుతోంది. దీంతో జనం అల్లాడుతున్నారు. నివారణ మార్గం తెలియక అయోమయంలో ఉన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ నల్లి దాడి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. పంటల్లో మిర్చి తోటలకే ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మిర్చి సాగు 42,150 ఎకరాలు ఉంటే అందులో పశ్చిమ ప్రాంతంలోనే అధికంగా సాగవుతుంది. అందులో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే 50శాతానికిపైగా అంటే దాదాపు 28వేల ఎకరాల వరకూ ఉంటుంది. ఈ-క్రాప్‌ నమోదైన ప్రకారం ఎర్రగొండపాలెం మండలంలో 8,873 ఎకరాలు, త్రిపురాంతకం మండలంలో 3,618 ఎకరాలు, పుల్లలచెరువు 6,017 ఎకరాలు, పెద్దారవీడు 4,297 ఎకరాలు, దోర్నాల 4,158 ఎకరాలు మొత్తం 26,963 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇది కాకుండా మరో వెయ్యి ఎకరాలకుపైగా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పంటపై సోకిన నల్లి కారణంగా మిర్చి రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇది సాధారణంగా అరటి, బొప్పాయి, కూరగాయలు, ఇతర పంటలపై కూడా దాడి చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా ఉన్న మిర్చిపై ప్రతాపం చూపుతోంది. పంటను నాశనం చేస్తోంది. అలాగే ఆ తోటలలో తిరిగే రైతులు, కూలీలపైనా నల్లి దాడిచేస్తోంది. మొదట దద్దుర్లు, నల్ల మచ్చలుగా ఏర్పడి తర్వాత తీవ్ర జ్వరానికి గురవుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోతున్నాయి.

మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి..

ఉద్యానవనశాఖ అధికారులు ఇటీవల పంటలను పరిశీలించి నల్లి నివారణ చర్యలు చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్రనష్టం జరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. అధికారులు చూసిన దానిని బట్టి కూడా ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో నల్లిదాడి తీవ్రంగానూ, పెద్దారవీడు, త్రిపురాంతకం, దోర్నాల మండలాల్లో పాక్షికంగా ఉన్నట్టు చెబుతున్నారు. నల్లి లేదా తామరపురుగు సోకిన మిర్చి మొక్కల ఆకులు ముడుచుకుపోతున్నాయి. అనంతరం నల్లగా, ఎర్రగా మారిపోయి ఎదుగుదల నిలిచిపోయి ఎండిపోతున్నాయి. బొప్పాయి, ఇతర పండ్ల తోటలకు ఆశించిన పురుగు కాయలపై గీకడం వలన చారలు పడుతున్నాయి. రసం పీల్చడంతో రాలిపోతున్నాయి. చలిగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో పంటలో వీటి సంతానోత్పత్తి అధికంగా ఉంటుందని, అందువల్ల జనవరి వరకు ఉధృతి కొనసాగుతుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు.

స్క్రబ్‌ టైఫస్‌ భయం

పంటపైనే కాకుండా ఒంటిపై (ప్రజల శరీరంపై) కూడా ఈ నల్లి పురుగు దాడిచేయడం ద్వారా స్క్రబ్‌ టైఫస్‌ సోకుతుందని తెలుసుకున్న జనం ఇదేం మాయదారి పురుగు అంటూ వణికిపోతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో పదికిపైగా కేసులు నమోదు కాగా సోమవారం ఒక్కరోజే నాలుగు వెలుగు చూశాయి. ఇప్పటికి ఈ వ్యాధి బారిన పడి ఇద్దరు మరణించగా వారిలో ఎర్రగొండపాలెంకు చెందిన ఒక మహిళ ఉన్నారు. ఎస్‌ఎన్‌పాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన మరో మహిళ మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా పొదిలి, కొనకనమిట్ల, బేస్తవారపేట ప్రాంతాల వారు ఉండటాన్ని బట్టి ఈ కేసులు కూడా పశ్చిమ ప్రాంతం నుంచే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చలు ఏర్పడటంతోపాటు తీవ్ర ఒళ్లు నొప్పులు, జ్వరం సోకినట్టయితే వ్యాధి లక్షణాలుగా భావించి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.

నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవీ..

నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట బెట్టకు రాకుండా నీటి తడులు అందించాలని ఎర్రగొండపాలెం ఉద్యానశాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. వైరస్‌ సోకిన మొక్కలపై ఉన్న కొత్త ఆకులు తుంచి లేదా పూర్తిగా మొక్కను తొలగించి దూరంగా వేసి కాల్చివేయాలన్నారు. తప్పనిసరిగా రైతులు పొలాల్లో ఎకరాకు 40 నుంచి 50 నీలిరంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇతర మందులతోపాటు వేపనూనె, కానుగనూనె, జిగురు కలిపి పిచికారీ చేయాలన్నారు. ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఫిప్రోనిల్‌ మరియు ఇమిడాక్లోప్రైడ్‌ను పిచికారీ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పంట ప్రారంభదశ నుంచే జిగురు అట్టలు ఏర్పాటుతో నల్లి దాడిని చాలావరకు తగ్గించుకోవచ్చని చెప్పారు.

Updated Date - Dec 16 , 2025 | 01:33 AM