Share News

పంచాయతీలు ప్రక్షాళన

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:22 AM

జిల్లాలో గ్రామపంచాయతీల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పల్లెప్రజలకు మునిసిపాలిటీల తరహాలో నిరంతరం సేవలు అందనున్నాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం జారీ చేసింది.

పంచాయతీలు ప్రక్షాళన

గ్రామాల్లో నిరంతరాయంగా సేవలు

నాలుగు విభాగాలుగా పాలన

ప్రత్యేక ఐటీ వింగ్‌... మునిసిపాలిటీల తరహాలో చర్యలు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామపంచాయతీల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పల్లెప్రజలకు మునిసిపాలిటీల తరహాలో నిరంతరం సేవలు అందనున్నాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం జారీ చేసింది. తద్వారా ప్రజలకు సేవలు వేగవంతంగా అందడంతోపాటు పారదర్శకత పెరగనుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో గ్రామ పంచాయతీలు స్వతంత్రంగా పనిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న క్లస్టర్‌ విధానాన్ని రద్దుచేసి పంచాయతీలను స్వతంత్రంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని ఆదాయం, జనాభా ఆధారంగా విభజించారు. ప్రస్తుతం ఐదు గ్రేడ్‌ల వారు పంచాయతీ కార్యదర్శులుగా వ్యవహరిస్తుండగా, గ్రేడ్‌-6 కార్యదర్శులు డిజిటల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. జిల్లాలో 38 మండలాలు ఉండగా వాటి పరిధిలో అధికంగా ఆదాయం ఉన్న 11 పంచాయతీలను స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. గ్రేడ్‌-1 పంచాయతీలు 75, గ్రేడ్‌-2 పంచాయతీలు 265, గ్రేడ్‌-3 పంచాయతీలు 373, జనాభా 500లోపు ఉన్న గ్రామ పంచాయతీలు ఐదు ఉన్నాయి. స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలకు డిప్యూటీ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులను నియమించనున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శులను పంచాయతీ అభివృద్ది అధికారులు (పీడీవో)గా పిలవనున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, బిల్‌ కలెక్టర్లకు సీనియారిటీని బట్టి ఉద్యోగోన్నతులు కల్పించి వారిని పంచాయతీల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా నియమిస్తారు.

ప్రజలకు సత్వర సేవలు

మునిసిపాలిటీల తరహాలోనే గ్రామ పంచాయతీల్లో పలు విభాగాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాలను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా సేవలు అందించేందుకు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌లో విధానంలో సిబ్బందిని నియమించనుంది. వారికి పంచాయతీ నిధుల నుంచే జీతాలు చెల్లిస్తారు. ప్రస్తుతం పంచాయతీల్లో అదనంగా ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు ఇక నుంచి పంచాయతీల్లో ప్లానింగ్‌ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో భవనాలు, లేఅవుట్‌ రూల్స్‌ను అమలుచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటుచేసి అదనంగా ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇతర అర్హతలు ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు. రికార్డులను డిజిటలైజేషన్‌ చేసి గ్రామపంచాయతీల్లో రియల్‌ టైంలో ప్రజలకు సర్వీసులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

Updated Date - Nov 13 , 2025 | 02:22 AM