Share News

‘ఉపాధి’ నిధులతో పంచాయతీ భవనాలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 02:27 AM

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో పంచాయతీ భవనాలను ప్రభుత్వం నిర్మించనుంది. అందుకు కేంద్ర ప్రభుత్వ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) పథకం ద్వారా సుమారు 80శాతం మంజూరు కానున్నాయి. మరో 20శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధుల నుంచి సమకూర్చాలని నిర్ణయించింది.

‘ఉపాధి’ నిధులతో పంచాయతీ భవనాలు

ఒక్కోదానికి రూ.32 లక్షలు

ఆర్‌జీఎస్‌ఏ కింద 80శాతం

మరో 20శాతం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మెటీరియల్‌ కోటా

జిల్లాకు 19 భవనాలు మంజూరు

ఒంగోలు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో పంచాయతీ భవనాలను ప్రభుత్వం నిర్మించనుంది. అందుకు కేంద్ర ప్రభుత్వ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) పథకం ద్వారా సుమారు 80శాతం మంజూరు కానున్నాయి. మరో 20శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధుల నుంచి సమకూర్చాలని నిర్ణయించింది. అలా రాష్ట్రంలో రెండు విడతలుగా 557 పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో జిల్లాకు సంబంధించి 19 ఉన్నాయి. ఇప్పటి వరకు భవనాలు లేని పంచాయతీల్లో వీటిని నిర్మించనున్నారు. గతంలో 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలు చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చింది. వాటికి భవన నిర్మాణాలను చేపట్టింది. జిల్లాలోనూ అత్యధిక గ్రామాల్లో అటు పంచాయతీ, ఇటు సచివాలయ భవనం ఏదో ఒకటి ఉన్నాయి. కొద్ది గ్రామాల్లో ఏ భవనం లేకుండా అద్దె గదులు లేదా సర్పంచ్‌ల ఇళ్లలోనే పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చి 31లోపు భవనాల నిర్మాణం పూర్తి

స్థానిక పరిపాలనా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ఆర్‌జీఎస్‌ఏ పథకం కింద పంచాయతీ భవన నిర్మాణాలకు కేంద్రం సంకల్పించింది. 2022 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఆ లోపు పంచాయతీ భవనాలు పూర్తికి కేంద్రం నిర్ణయించింది. అందుకు గాను కేంద్రం 80శాతం నిధులు సమకూర్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 20శాతం భరించాలి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా ద్వారా కేటాయింపునకు నిర్ణయించింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.32 లక్షలు వ్యయం అంచనా కాగా అందులో రూ.7 లక్షలను ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నుంచి కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సొంత భవనం లేని గ్రామాలు, సచివాలయాలు.. అలాగే తక్షణం భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు.

భవనం మంజూరైన పంచాయతీలు ఇవీ..

తొలివిడత రాష్ట్రంలో 140 భవనాలు మంజూరు కాగా జిల్లాకు సంబంధించి ఒకే ఒక్కటి వెలిగండ్ల మండలం పందువ గ్రామ పంచాయతీ ఉంది. రెండో విడతలో పెద్దయాచవరం, నికరంపల్లి, పడమటిపల్లి, కె.కొత్తపల్లి, గంటవానిపల్లె, బాడేనాయక్‌ తండా, రామాయపాలెం, ఉమ్మనపల్లె, జోళ్లపాలెం, మోటుపల్లె, బూరేపల్లి, బాదినేనిపల్లి, ఎస్‌.కొత్తపల్లి, జయరాంపురం, సంగాపురం, సంగంతండా పంచాయతీలకు భవనాలను మంజూరు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా త్వరలో నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ గంగవరపు జోసఫ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 07 , 2025 | 02:27 AM