పేద విద్యార్థులతో పీ4 తొలి మార్గదర్శి మమేకం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:23 PM
పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామానికి చెందిన పేద విద్యార్థులతో పీ-4 మొదటి మార్గదర్శి, లాయిడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటేడ్ ఎండీ విక్రం నారాయణరావు ఆదివారం మమేకయ్యారు. గొనసపూడి గ్రామంలోని తన స్వగృహానికి విద్యార్థులను పిలిపించుకొని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చినగంజాం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి) : పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామానికి చెందిన పేద విద్యార్థులతో పీ-4 మొదటి మార్గదర్శి, లాయిడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటేడ్ ఎండీ విక్రం నారాయణరావు ఆదివారం మమేకయ్యారు. గొనసపూడి గ్రామంలోని తన స్వగృహానికి విద్యార్థులను పిలిపించుకొని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామం వచ్చిన సందర్భంగా రాష్ట్ల్రంలోని మొట్టమొదటి మార్గదర్శిగా విక్రం నారాయణరావుని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన గ్రామంలోని 15 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న 15 కుటుంబాలలో ఉన్న ఆరుగురు విద్యార్థులు ఎల్లావుల గణేష్, మద్దిన నాగార్జున, కిలారి దివ్య, ఎల్లావుల సుధీర్, ఎల్లావుల ప్రభాకర్, గోనె హేమలతలతో ఆయన మాట్లాడారు. వారి యోగక్షేమాలతోపాటు వారు ఏ తరగతి చదువుతున్నది, ఏ పాఠశాలలో చదువుతున్నారు, విద్యా విధానం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల పాఠశాల ఫీజులు ఆయనే చెల్లిస్తున్నారు. ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య, టీడీపీ నాయకులు కొండ్రగుంట శ్రీహరి, దివ్వకోలు రాము, వెంకటరావు, ఏపీఎం గద్దె పెదసుబ్బారావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు కే శారద తదితరులు పాల్గొన్నారు.