వెల్లువెత్తుతున్న ఉత్సాహం
ABN , Publish Date - May 28 , 2025 | 01:34 AM
తెలుగుదేశం పార్టీ కడప నగర సమీపంలో నిర్వహిస్తున్న మహానాడుకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ జరగనున్న మహానాడు మంగళవారం ప్రారంభం కాగా ప్రతినిధుల సభ నిర్వహించారు.
మహానాడు ప్రతినిధుల సభకు జిల్లా నుంచి భారీగా హాజరు
వందలాది వాహనాల్లో వెళ్లిన టీడీపీ శ్రేణులు
చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలపై ఆసక్తి
తొలిరోజు పార్టీ అంశాలపైనే ప్రధాన దృష్టి
మంత్రి స్వామి నేతృత్వంలో రక్తదాన శిబిరం
రూ.25లక్షలు విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే జనార్దన్
ఒంగోలు, మే 27 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ కడప నగర సమీపంలో నిర్వహిస్తున్న మహానాడుకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ జరగనున్న మహానాడు మంగళవారం ప్రారంభం కాగా ప్రతినిధుల సభ నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వందలాది వాహనాల్లో పార్టీ నాయకులు వెళ్లారు. తొలిరోజు ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణ అంశాలు, పార్టీ ప్రాధాన్యతలపై ప్రసంగాలు జరగ్గా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగాలపై జిల్లా నుంచి వెళ్లిన ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. మంత్రి డాక్టర్ స్వామితోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎరిక్షన్‌బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఇతర ముఖ్య నేతలు ఒక రోజు ముందుగానే కడప చేరుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, పట్టణాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వందలాది మంది మంగళవారం ఉదయం ఉత్సాహంగా బయల్దేరి వెళ్లారు.
పెద్దసంఖ్యలో రక్తదానం
మహానాడు సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డిఎస్‌బీవీ స్వామి కన్వీనర్‌గా ఉన్న కమిటీ నేతృత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించగా పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు రక్తదానం చేసినట్లు సమాచారం. వారికి మంత్రి స్వామి సర్టిఫికెట్లు అందజేయగా కమిటీలో సభ్యులుగా ఉన్న జిల్లా నేతలు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. మరోవైపు మహానాడు విజయవంతం కోసం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రూ.25లక్షల విరాళం అందజేశారు. ఆ మహానాడు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద పార్టీ అధికారంలోకి తిరిగి రావడం, ప్రత్యేకంగా కడపలో నిర్వహిస్తుండటంతో మహానాడుకు పార్టీశ్రేణులు జిల్లా నుంచి ఉత్సాహంగా తరలివెళ్ళారు.