Share News

కష్టాలను దాటి.. ఉన్నతంగా ఎదిగి

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:29 AM

ఆయన చిన్నతనంలో తల్లిని కోల్పోయారు. యుక్త వయసులోకి వచ్చే సరికి తండ్రి కూడా మృతి చెందారు. అయినప్పటికీ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదువును కొనసాగించారు. నాయనమ్మ కూరగాయలు అమ్ముకుంటూ వచ్చే అరకొర డబ్బుతో అండగా నిలవడంతో డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు.

కష్టాలను దాటి.. ఉన్నతంగా ఎదిగి
నాయనమ్మ అశీర్వచనం తీసుకుంటున్న ఉదయ్‌కృష్ణారెడ్డి(ఫైల్‌) (ఇన్‌సెట్‌లో) మెరైన్‌ కానిస్టేబుల్‌గా ఉన్న సమయంలో ఉదయ్‌కృష్ణారెడ్డి (ఫైల్‌)

ఐపీఎస్‌గా కానిస్టేబుల్‌

సివిల్స్‌లో సత్తాచాటిన ఊళ్లపాలెం పేదింటి బిడ్డ

సీఐ అవమానించారని ఉద్యోగాన్ని వదిలి సివిల్స్‌పై దృష్టి సారించిన ఉదయ్‌ కృష్ణారెడ్డి

ఐదో ప్రయత్నంలో 350వ ర్యాంకు

అభినందిస్తూ సీఎం చంద్రబాబు, లోకేష్‌ ట్వీట్‌

సింగరాయకొండ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ఆయన చిన్నతనంలో తల్లిని కోల్పోయారు. యుక్త వయసులోకి వచ్చే సరికి తండ్రి కూడా మృతి చెందారు. అయినప్పటికీ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదువును కొనసాగించారు. నాయనమ్మ కూరగాయలు అమ్ముకుంటూ వచ్చే అరకొర డబ్బుతో అండగా నిలవడంతో డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఆసమయంలో ఆయన్ను మెరైన్‌ సీఐ ఒకరు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. 60 మంది సిబ్బంది ఎదుట ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అవమానించారు. దీంతో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి కసి, పట్టుదలతో సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. వరుసగా మూడుసార్లు విఫలమైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. సంకల్పంతో ముందుకు సాగారు. నాలుగోసారి 780వ ర్యాంకు సాధించారు. మరలా పట్టువదలకుండా ఐదోసారి సివిల్స్‌లో సత్తాచాటారు. 350వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. దీంతో కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ సాధించారు. ఇది సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం గ్రామానికి చెందిన పేదింటి బిడ్డ మూలగాని ఉదయ్‌ కృష్ణారెడ్డి విజయ గాథ.

మండలంలోని తీరప్రాంత గ్రామమైన ఊళ్లపాలెంకు చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డిది పేద కుటుంబం. చిన్నతనంలోనే తల్లి జయమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. డిగ్రీ చదివే సమయంలో తండ్రి శ్రీనివాసుల రెడ్డిని కూడా ఆయన కోల్పోయారు. తల్లిదండ్రులు మరణించ డంతో కృష్ణారెడ్డితోపాటు ఆయన సోదరుడికి నాయనమ్మ అండగా నిలిచింది. గ్రామంలో కూరగాయలు అమ్ముతూ కష్టపడి వారిని చదివించింది. అందులో పెద్దవాడైన ఉదయ్‌కృష్ణారెడ్డికి చిన్నతనం నుంచే డాక్టర్‌ కావాలన్న ఆకాంక్ష ఉండేది. దానికి పేదరికం అడ్డుగా మారింది. డాక్టర్‌ కావాలన్న లక్ష్యాన్ని మార్చుకొని తన నాయనమ్మ రమణమ్మ సహకారంతో చదువుల్లో ముందుకు సాగారు. ప్రాఽథమిక, హైస్కూల్‌ విద్యను తెలుగు మీడియంలో స్వగ్రామమైన ఊళ్లపాలెం ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. ఇంటర్‌, డిగ్రీని కావలి జవహర్‌ భారతిలో అభ్యసించారు.

తొలి ప్రయత్నంలో కానిస్టేబుల్‌గా!

డిగ్రీ తృతీయ ఏడాది చదువుతున్న సమయంలో ఉదయ్‌ కృష్ణారెడ్డి తొలి ప్రయత్నంలోనే 2012లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అదేసమయంలో డిగ్రీని కూడా పూర్తి చేశారు. 2013లో గూడ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత రామాయపట్నం మెరైన్‌ కానిస్టేబుల్‌గా బదిలీ అయ్యారు. అక్కడ సీఐ ఆయన్ను ఇబ్బంది పెట్టారు. అఫ్ర్టాల్‌ నువ్వొక కానిస్టేబుల్‌వంటూ అవమానించారు. ‘అడుగో ఐపీఎస్‌ వచ్చాడయ్యా..’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక రోజు ఐదు నిమిషాలు ఆలస్యంగా విధులకు హాజరుకావడంతో సిబ్బంది అందరు ముందు హేళన చేశారు. దీంతో 2018లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఐదో ప్రయత్నంలో..

ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయాన్ని ఉదయ్‌కృష్ణారెడ్డి ఇంట్లో వారికి చెప్పకుండా సివిల్స్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. రోజుకు 14 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. తెలుగు మీడియంలో చదువుకోవడంతో ఇంగ్లీషు భాషపై అంతగా పట్టు ఉండేది కాదు. దీంతో 1నుంచి10వ తరగతి వరకు ఇంగ్లీషు పుస్తకాల వెనుక ఉన్న ఎక్సర్‌సైజ్‌లను, ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీషు ఎక్సర్‌సైజ్‌లను పూర్తిచేయడం ద్వారా పట్టుపెంచుకున్నారు. 2019లో సివిల్స్‌ తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. ఫైనల్‌ కటాఫ్‌కు చేరువలో వచ్చి ఆగిపోయారు. అనంతరం ఆయనలో కసి, పట్టుదల పెరిగాయి. 2020లో కరోనా వలన సివిల్స్‌ రాయలేదు. 2021, 2022 ప్రిలిమ్స్‌ కూడా క్వాలిఫై కాలేకపోయారు. సివిల్స్‌లో వరుసగా మూడుసార్లు విఫలమయ్యారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు. దీంతో గత ఏడాది (2023) నాల్గో ప్రయత్నంలో సివిల్స్‌లో 780 ర్యాంకును సాధించారు. దీంతో ఐఆర్‌ఎంఎస్‌లో ఉద్యోగం సాధించారు. అనంతరం ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్నారు. మరలా దీర్ఘకాలిక సెలవులు తీసుకొని సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఐదో ప్రయత్నంలో ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో 350వ ర్యాంకు సాధించారు. దీంతో ఓ పేదింటి బిడ్డ కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ స్థాయికి ఎదగడం పట్ల మండల ప్రజలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఉదయ్‌ ప్రయాణం అభినందనీయం : సీఎం నారా చంద్రబాబునాయుడు

ఉదయ్‌కృష్ణారెడ్డి విజయాన్ని అభినందిస్తూ సీఎం నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఎక్స్‌, ఫేస్‌బుక్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకు ఆయన ప్రయాణం అభినందనీయమన్నారు. ధైర్యసాహసాలు, అవిశ్రాంత కృషి ఉంటే ఏ కల కూడా పెద్దది కాదని ఉదయ్‌కృష్ణారెడ్డి రుజువు చేశారన్నారు. ధృడసంకల్పంతో అన్ని అవరోధాలను అధిగమిస్తూ కొత్త తీరాలను చేరుకోవచ్చని ఉదయ్‌ కథ గుర్తుచేస్తున్నదని కొనియాడారు. మంత్రులు నారా లోకేష్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కూడా ఉదయ్‌ను అభినందించారు.

Updated Date - Apr 30 , 2025 | 01:29 AM