Share News

కిటకిట...!

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:04 PM

దసరా సెలవులు ముగియడంతో రవా ణా వ్యవస్థకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. పండుగకు సొంతూర్లకు వచ్చి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు.

కిటకిట...!
ఒంగోలు డిపోలో కిక్కిరిసిన ప్రయాణికులు

ఆర్టీసీ బస్‌లు, రైళ్లల్లో రిజర్వేషన్‌లు ఫుల్‌

దసరా సెలవులు ముగియడంతో రవాణా వ్యవస్థకు డిమాండ్‌

బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు రద్దీ

దూర ప్రాంతాలకు వెళ్లే వారికి తప్పని ప్రయాణ కష్టాలు

ఒంగోలు, కార్పొరేషన్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : దసరా సెలవులు ముగియడంతో రవా ణా వ్యవస్థకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. పండుగకు సొంతూర్లకు వచ్చి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఈనెల 2వ తేదీతో సెలవులు ముగిశాయి. శుక్రవారం నుంచి ఆఫీసులు, స్కూళ్లు తెరుచుకున్నాయి. ఉద్యోగులకు ఆప్షనల్‌ హాలిడే అవకాశం ఉండటంతో మరో రెండు రోజులు స్వగ్రామాల్లోనే గడిపారు. ఆదివారం తిరుగు ప్రయాణం కావడంతో రైళ్లు, బస్టాండ్‌లు కిటకిటలాడాయి. అన్నిచోట్లా రిజర్వేషన్‌లు ఫుల్‌ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్‌తో రద్దీగా మారాయి.

సాధారణ బస్సుల కోసం పడిగాపులు

పల్లెల నుంచి పట్టణాలకు చేరుకునేందుకు జిల్లాలో అధిక శాతం మందికి ఆర్టీసీనే ఆధారమైంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు కొన్ని రూట్లలో తిరిగే బస్సులను రద్దు చేసి దూరప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులుగా కేటాయించడంతో అప్పుడప్పుడూ వచ్చే పల్లె వెలుగు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.ఒంగోలుకు ఎలాగోలా చేరుకుంటున్న అధిక శాతం మందికి ప్రైవేటు ట్రావెల్స్‌ ఆధారమయ్యాయి. ఆర్టీసీలో ఓల్వా, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, స్లీపర్‌, గరుడ వంటి బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్‌ ఫుల్‌ అయ్యింది. రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ మంది సాధారణ బస్సుల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది.

ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు

దూరప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రకాశం రీజియన్‌ నుంచి సుమారు 10 బస్సులను అదనంగా కేటాయించారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వీటిని కేటాయించారు. ఆ బస్సుల్లోనూ సీటు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గమ్యస్థానం చేరుసుకునేందుకు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:04 PM