అడ్డగోలుగా ఆన్‌లైన్!
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:45 AM
పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయం వేదికగా భూమాయ చోటుచేసుకుంది. మండలంలోని తోకపల్లిలో రైతులకు చెందిన 9.87 ఎకరాల భూమిని తహసీల్దార్ ఓ వ్యక్తి పేరుతో ఆన్‌లైన్ చేశారు. రాత్రికిరాత్రే అప్పటి వరకూ భూములకు యజమానులుగా ఉన్న పది మంది పేర్ల స్థానంలో వారితో సంబంధంలేని మరో వ్యక్తి పేరు చేరిపోయింది.
రైతుల భూములను ఇంకొకరి పేరుపై మార్చిన తహసీల్దార్
మరికొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న సదరు అధికారి
రాత్రికిరాత్రే పెద్దారవీడు కార్యాలయంలో మాయ
ఆ 9.87 ఎకరాలు వివాదాస్పద భూములు
అయినా బరితెగింపు.. తోకపల్లి బాధితుల నిరసన
పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయం వేదికగా భూమాయ చోటుచేసుకుంది. మండలంలోని తోకపల్లిలో రైతులకు చెందిన 9.87 ఎకరాల భూమిని తహసీల్దార్ ఓ వ్యక్తి పేరుతో ఆన్‌లైన్ చేశారు. రాత్రికిరాత్రే అప్పటి వరకూ భూములకు యజమానులుగా ఉన్న పది మంది పేర్ల స్థానంలో వారితో సంబంధంలేని మరో వ్యక్తి పేరు చేరిపోయింది. విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయిన బాధిత రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. గతంలోనూ ఈ భూములపై వివాదం నడిచింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో తహసీల్దార్ అడ్డగోలుగా ఆన్‌లైన్ చేయడం ఆయన బరితెగింపును తెలియజేస్తోంది. మరికొద్ది నెలల్లోనే సదరు తహసీల్దార్ ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో అందినకాడికి దండుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కాపురం డివిజన్‌లో గత వైసీపీ హయాంలో పనిచేసిన కొందరు తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది ఉద్యోగ విరమణ ముందు భూ మాయలు చేసి అరెస్టు కావడం, విచారణలు ఎదుర్కోవడం వంటి ఉదంతాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి వ్యవహారాలు ఇంకా కొనసాగుతుండటం రెవెన్యూలో అక్రమాలు వ్యవస్థీకృతమన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
పెద్దారవీడు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం డివిజన్‌లో ఇప్పటి వరకూ ప్రభుత్వ భూములు మాత్రమే ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పుడు పెద్దారవీడులో ఏకంగా రైతుల భూములనే మార్చేశారు. ఈ అక్రమానికి తహసీల్దార్ కార్యాలయం కేంద్ర బిందువుగా మారింది. ఇవి కలెక్టర్ స్థాయి అధికారి విచారణ పరిధిలో ఉన్న భూములు కావడం సదరు అక్రమార్కుల బరితెగింపును తెలియజేస్తోంది.
రాత్రికి రాత్రే 9.87 ఎకరాలు మార్పిడి
పెద్దారవీడు మండలం తోకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపు పది మంది రైతుల పేర్లతో ఉన్న 9.87 ఎకరాల భూమిని శుక్రవారం రాత్రి తహసీల్దార్ దిలీ్‌పకుమార్ అదే గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో మారుస్తూ డిజిటల్ సంతకం చేశారు. నిబంధనల ప్రకారం ఆ భూ ములకు కిందిస్థాయి సిబ్బంది రికార్డు తయారు చేయాల్సి ఉంది. కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే సదరు తహసీల్దార్ పనికానిచ్చేశారు. తోకపల్లి గ్రామానికి చెందిన బిట్ర వెంకట లక్ష్మమ్మ, తిరుమలమ్మ పేర్లతో సర్వే నంబరు 102/1బీలో 3.58 ఎకరాలు, మేకల పోతురాజు పేరుతో సర్వే నంబరు 214లో 0.28 సెంట్లు, ఉప్పలపాటి ఆదాం, కోటయ్య, అచ్చయ్య పేర్లతో సర్వే నంబరు 263/3లో 4.76 ఎకరాలు, కనకం కోటేశ్వరమ్మ పేరుతో సర్వే నెంబరు 349లోని 0.96 సెంట్ల భూమి, రమ్య, కీర్తి పేరుతో సర్వే నంబరు 23లో 0.18 సెంట్ల భూమి, సరాల వెంకట్రావు పేరుతో సర్వే నంబరు 215లోని 0.11 సెంట్ల భూములు రాత్రికి రాత్రే పేర్లు మారిపోయాయి. అదేగ్రామానికి చెందిన మేకల శంకరరావుకు ఆ భూములపై హక్కు ఉన్నట్లు తహసీల్దార్ దిలీ్‌పకుమార్ నిర్ధారిస్తూ డిజిటల్ సంతకం చేశారు.
విచారణలో ఉన్న భూములు
తహసీల్దార్ దిలీ్‌పకుమార్ శుక్రవారం సంతకాలు చేసిన భూములతోపాటు మరి కొన్నింటిపై విచారణ జరుగుతోంది. పెద్దారవీడు తహసీల్దార్‌గా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పులి శైలేంద్రకుమార్ గత ఏప్రిల్‌లో ఆ భూములను మేకల శంకరరావు పేరుపై ఆన్‌లైన్ చేశారు. బాధితులు అప్పటి కలెక్టర్‌కు ఒంగో లు వెళ్లి ఫిర్యాదు చేయడంతో భూ యజమాని మా ర్పిడి ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అప్పటి కలెక్టర్ తోకపల్లిలోని ఆయా భూములను వివాదాస్పద జాబితాలో చేర్చాలని, వాటిపై విచారణ చేపట్టాలని నివేదిక ఇవ్వాలని వెలిగొండ ప్రాజెక్ట్ కంభం ఎస్‌డీసీని ఆదేశించారు. ప్రస్తుతం ఆ భూము ల పరిస్థితి విచారణ దశలో ఉంది. కానీ శైలేంద్రకుమార్ ఉద్యోగ విరమణ అనంతరం పెద్దారవీడుకు తహసీల్దార్‌గా వచ్చి న దిలీ్‌పకుమార్‌కు గతంలోనూ ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది. విచారణలో ఉన్న భూములపై శుక్రవారం రాత్రి ఆయన డిజిటల్ సంతకం చేశారు.
తోకపల్లి బాధితుల నిరసన
తమ భూమలను వేరొకరి పేరుపై మార్చడాన్ని గుర్తించిన తోకపల్లి భూబాధితులు శనివారం పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫోన్ల ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు స్థానిక తహసీల్దార్‌ను నిలదీశారు. స్పందించిన తహసీల్దార్ దిలీప్‌కుమార్ ప్రస్తుతం డిజిటల్ సంతకం తొలగించే అవకాశం తనకు లేదని, జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉందని తెలిపారు. అదేవిధంగా ఆ భూములకు సంబంధించి ఎటువంటి క్రయవిక్రయాలకు అనుమతులు ఇవ్వద్దంటూ మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆయన లేఖ రాశారు.
గతంలో జోరుగా ఇలాంటి వ్యవహారాలు
మార్కాపురం డివిజన్ అంటే భూఅక్రమాలకు కేంద్రబిందువుగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నేతల భూ అక్రమాలకు తోడ్పాటునందించి మార్కాపురంలో తహసీల్దార్ స్థాయి అధికారి ఉద్యోగ విరమణ అనంతరం అరెస్టయ్యారు. అందుకు సహకరించిన 14మంది వీఆర్వోలు, ఎంఆర్‌ఐ కూడా సస్పెండయ్యారు. తర్లుపాడు మండలంలో సైతం నేతల భూ అక్రమాలకు కొమ్ముకాసిన తహసీల్దార్ సెలవుపై విదేశాలకు వెళ్లినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు తమదైన శైలిలో స్పందించి పిలిపించారు. ఇటువంటి ఉదంతాలు మార్కాపురం డివిజన్‌లోని ప్రతి మండలంలో సర్వసాధారణమయ్యాయి. కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది ఉద్యోగ విరమణ చేయబోయే ఉన్నతాధికారులు కావడం చర్చనీయాంశమైంది. పెద్దారవీడు తహసీల్దార్ సైతం మరికొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండటం గమనార్హం.