మెప్మాలో కొనసాగుతున్న విచారణ
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:38 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో చోటుచేసుకున్న అవినీతిపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ చేపట్టిన విచారణ శనివారం కొనసాగింది. విచారణ కమిటీ సభ్యుడైన డీఆర్‌డీఏ పీడీ నారాయణ నేతృత్వంలో మెప్మా జిల్లా కార్యాలయంలో శనివారం పలు రికార్డులను పరిశీలించారు.
కొలిక్కివస్తున్న బోగస్ గ్రూపుల వ్యవహారం
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో చోటుచేసుకున్న అవినీతిపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ చేపట్టిన విచారణ శనివారం కొనసాగింది. విచారణ కమిటీ సభ్యుడైన డీఆర్‌డీఏ పీడీ నారాయణ నేతృత్వంలో మెప్మా జిల్లా కార్యాలయంలో శనివారం పలు రికార్డులను పరిశీలించారు. వారం క్రితం కార్యాలయానికి వచ్చిన విచారణ కమిటీ.. ఉద్యోగులకు పలు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం జేసీ చాంబర్‌లో పీడీ శ్రీహరి, సీఎంఎం సంతోష్‌లను విచారించారు. బోగస్ గ్రూపులను బయటకు తీసుకొచ్చే దిశగా పలు చర్యలు చేపట్టారు. రుణాల మంజూరు, బ్యాంకు లింకేజీలు, రుణ చెల్లింపులతో పాటు, బోగస్ గ్రూపుల గుర్తింపుపై పలు సూచనలు చేశారు. మూడు గ్రూపులకు ఒక ఆర్పీ, సీవోలు, ఐబీ స్పెషలిస్ట్ నేతృత్వంలో విచారించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. వారు తయారుచేసిన రిపోర్టులను తెప్పించుకుని శనివారం పరిశీలించారు. పీడీ శ్రీహరితోపాటు సీఎంఎం, సీవోలు, బ్యాంకు లింకేజీ అధికారి, ఐబీ స్పెషలిస్ట్‌లతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. దీంతో నకిలీ గ్రూపులతో రూ.కోట్లు దోచేసిన ఆర్పీలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా లోతుగా అధ్యయనం చేసి, అందులో భాగస్వాములైన వారిని గుర్తించే పనిలో విచారణ కమిటీ ఉంది. మొత్తంగా వరుస విచారణలతో బోగస్ గ్రూపులతో దోచుకున్న వారిలో ఆందోళన నెలకొంది. విచారణ అనంతరం చర్యలు ఏవిధంగా ఉంటాయోనన్న భయం అవినీతిపరుల్లో కనిపిస్తోంది. కేసులు పెడతారా? దోచుకున్నదంతా వసూలు చేస్తారా? లేక ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అనే చర్చ మెప్మాలో సాగుతోంది.