వంద ఉపన్యాసాల కన్నా ఒక్క పాట శక్తివంతమైంది
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:05 AM
: వంద ఉపన్యాసాల కన్నా ప్రజా కళాకారుని ఒక పాట ఎంతో శక్తివంతమైనదని, ప్రజలను చైతన్యపరుస్తూ దూసుకుపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ చెప్పారు.
ప్రజా కళాకారులు దేశంలోని రుగ్మతలపై
సాంస్కృతికోద్యమం నిర్వహించాలి
ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఏపూరి సోమన్న
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రదర్శనలు
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : వంద ఉపన్యాసాల కన్నా ప్రజా కళాకారుని ఒక పాట ఎంతో శక్తివంతమైనదని, ప్రజలను చైతన్యపరుస్తూ దూసుకుపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ చెప్పారు. సీపీఐ వందేళ్ల పండుగను పురస్కరించుకుని ఒంగోలులో ఈనెల23వ తేదీ నుంచి నిర్వహించననున్నసభలను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ఏపీ ప్రజా నాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ వ్యవహరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశం నేడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అటువంటి పరిస్థితుల్లోనూ డాక్టర్ అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగం గొప్ప స్ఫూర్తితో నిలుస్తోందన్నారు. బీజేపీపై వామపక్ష పార్టీలు సాగిస్తున్న పోరాటంలో ప్రజా కళాకారులు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఈ సందర్భంగా సినీ దర్శకులు బాబ్జీ మాట్లాడుతూ తాము ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి ప్రజా నాట్యమండలినే కారణమన్నారు. ప్రజా వాగ్గేయకారులు గోరేటి వెంకన్న, ఏపూరి సోమన్న ఆట, పాట, మాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్ర నాయక్, కార్యదర్శులు చిన్నం పెంచలయ్య నాగరాజు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.